వర్కర్లను వదిలేసి వరదల నుంచి తప్పించుకున్న CEO
CEO: అమెరికాలోని చాలా ప్రాంతాల్లో హెలెనె అనే హరికేన్ బీభత్సం సృష్టించింది. దాదాపు 200 మంది ఈ హరికేన్ కారణంగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో టెన్నెసె ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని వర్కర్లను సీఈవో వదిలేసి వెళ్లిపోయాడు. ఫలితంగా చాలా మంది వర్కర్లు తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయారు. టెన్నెస్ ప్రాంతంలో ఉన్న ఇంపాక్ట్ ప్లాస్టిక్స్ అనే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సెప్టెంబర్ 27న తుఫాను బీభత్సంగా ఉందని తెలిసినా ఫ్యాక్టరీకి వెళ్లారు. హరికేన్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
దాంతో తమకు కూడా సెలవు ప్రకటిస్తారేమో అనుకున్నారు. కానీ ఇంపాక్ట్ ప్లాస్టిక్స్ సీఈవో వర్కర్లంతా హరికేన్ ఉన్నా కూడా ఫ్యాక్టరీకి వెళ్లి పనిచేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేసారు. అప్పటివరకు అదే ఫ్యాక్టరీలో ఉన్న సీఈవో తుఫాను బీభత్సానికి భయపడి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ వర్కర్లను మాత్రం ఫ్యాక్టరీ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసారు. దాంతో వారు పనిచేస్తుండగా.. తుఫాను తీవ్రంగా మారి దాదాపు 11 మంది ప్రాణాలు తీసింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవారిలో మరో ఐదుగురు కొట్టుకుపోయారు.
నలుగురిని కాపాడగా మరో వ్యక్తి జాడ కనిపించలేదు. దాంతో ఆ వ్యక్తి కుటుంబీకులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోర్టుకు లాగారు. జరిగిన ప్రాణ నష్టానికి గానూ తమకు పరిహారం చెల్లించాల్సిందేనని.. వర్కర్ల ప్రాణాలను లెక్క చేయని ఇలాంటి ఫ్యాక్టరీలను మూసివేయాలని కూడా పిటిషన్ వేసారు. దీనిపై టెన్నెస్ కోర్టు విచారణ జరుపుతోంది.