Brij Bhushan Sharan Singh: “ఓ తండ్రిలానే పట్టుకున్నా అనేవాడు”
Delhi: రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wfo) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై (Brij Bhushan Sharan Singh) ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒక ఎఫ్ఐఆర్‌లో ఆరుగురు ఇచ్చిన ఫిర్యాదులను నమోదు చేయగా.. మరో ఎఫ్ఐఆర్‌లో ఓ మైనర్ రెజ్లర్ తండ్రి చేసిన ఫిర్యాదును నమోదు చేసారు. ఇంత మంది ఆడ రెజ్లర్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ తాను అమాయకుడినేనని, ఆరోపణలు నిజమేనని తేలితే ఉరేసుకుంటానని అంటున్నారు బ్రిజ్ భూషణ్. నోటికొచ్చినట్లు తన గురించి తప్పుడు ఆరోపణలు చేయకుండా సాక్ష్యం ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క తమ నుంచి ఫిర్యాదులు రికార్డు చేసుకునేటప్పుడు ఆడియో రికార్డర్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారని దాంతో తమ ఫిర్యాదులు పూర్తిగా రికార్డ్ అవ్వనివ్వడంలేదని బాధితులరు ఆరోపిస్తున్నారు.
ఆరుగురు రెజ్లర్లలో ఒక అమ్మాయి వాదన ప్రకారం.. అథ్లెట్లు ఫిట్‌గా ఉండటానికి కావాల్సిన సప్లిమెంట్లు తన వద్ద ఉన్నాయని అవి కావాలంటే లైంగిక కోరికలు తీర్చాలని బ్రిజ్ భూషణ్ అనేవాడని తెలిపారు. “నా దగ్గర ఫోన్ ఉండేది కాదు. ఓసారి బ్రిజ్ భూషణ్ అమ్మానాన్నలతో మాట్లాడిస్తానని చెప్పి పిలిచాడు. నేను ఫోన్ మాట్లాడక నన్ను పట్టుకుని దగ్గరికి లాక్కుని హగ్ చేసుకున్నాడు. నేను షాక్‌లో ఉన్నాను. దాంతో నేను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చాసాను. నా నోరు మూయించాలని అయ్యో ఎందుకు ఏడుస్తున్నావ్ తండ్రిలాంటివాడిని కాబట్టే అలా పట్టుకున్నాను అన్నాడు” అంటూ తన బాధను వెల్లడించింది ఓ బాధితురాలు. ఇక ఈ ఆరోపణలపై నమోదైన కేసులు కోర్టు వరకు వెళ్లలేదు. దిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్నారు.