Rameswaram Cafe లో పేలుడు
Rameswaram Cafe: రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కేఫ్‌లోని కిచెన్‌లో సిలిండర్ పేలినట్లు తమకు సమాచారం అందిందని ఫైర్ సిబ్బంది వెల్లడించారు. అయితే బీజేపీ ఎంపీ మాత్రం ఇది బాంబు పేలుడు అని పేర్కొనడం సంచలనంగా మారింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఉన్న ఫేమస్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించడం పెను సంచలనంగా మారింది. ఈ పేలుడులో రామేశ్వరం కేఫ్‌లో పని చేస్తున్న సిబ్బంది, కస్టమర్లు సహా మొత్తం ఇప్పటివరకు ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక.. కేఫ్‌కు వచ్చిన కస్టమర్లు, స్థానికులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. రామేశ్వరం కేఫ్‌లోని వంటగదిలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని కేఫ్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ పేలుడు సిలిండర్ పేలుడు కాదని.. బాంబు పేలుడు అని ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించడం పెను సంచలనం అవుతోంది.
బెంగళూరు నగరంలోని కుండలహళ్లి ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇంకా ఎవరైనా గాయపడిన వారు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. అయితే, కెఫే సమీపంలో ఒక బ్యాగ్ లో పేలుడు పదార్ధాన్ని ఉంచి, రిమోట్ తో దాన్ని పేల్చినట్లు భావిస్తున్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బ్యాగ్ ను అక్కడ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుతో రద్దీగా ఉండే రామేశ్వరం కెఫే లో ఒక్కసారిగా గందరగోళం, తొక్కిసలాట నెలకొన్నది. పేలుడు ధాటికి రామేశ్వరం కేఫ్‌లో ఉన్న ఫర్నీచర్, వస్తువులు ఎగిరిపడ్డాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువుల మధ్యలో ఎవరైనా ఉన్నారా అని పోలీసులు గాలింపు చేపట్టారు.
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిందని తమకు కేఫ్ సిబ్బంది సమాచారం అందించినట్లు వైట్‌ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. వెంటనే ఫైర్ ఇంజిన్లు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. కేఫ్‌లో ఉన్న కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు తమకు సిబ్బంది చెప్పినట్లు అధికారులు వివరించారు. ఘటనాస్థలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఫైర్ అధికారులు పేర్కొన్నారు.
మరో పక్క నగరంలోని 44 ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్ధాలు అమర్చినట్లు ఇ మెయిల్ లో పేర్కొన్నారు. వైట్ ఫీల్డ్, కోరమండల్, బస్వేష్ నగర్, యలహంక, సదాశివనగర్ సహా బాంబు బెదిరింపు వచ్చిన అన్ని పాఠశాలలకు బాంబు స్క్వాడ్ లను పంపించారు. విద్యార్ధులను, సిబ్బందిని వెంటనే పాఠశాలల నుండి ఖాళీ చేయించారు.