Bangladesh: బంగ్లాదేశ్‌లో వ‌ర‌ద‌లు.. భార‌తే కార‌ణ‌మ‌ట‌

bangladesh blames india for floods

Bangladesh: మొన్న‌టి వ‌ర‌కు అల్ల‌ర్ల‌తో అట్టుడికిన బంగ్లాదేశ్‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. దాదాపు 1.8 మిలియ‌న్ మంది జీవనాలు స్తంభించాయి. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా వివిధ ప్ర‌మాదాల్లో ఐదుగురు మృతిచెందారు. అయితే ఈ వ‌ర‌ద‌ల‌కు భార‌తే కార‌ణ‌మ‌ని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. త్రిపుర‌లోని గోమ‌తి న‌దిపై ఉన్న డంబూర్ డ్యాం గేట్లు తెర‌వ‌డం వ‌ల్లే బంగ్లాదేశ్‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని అంటున్నారు. దాంతో భార‌త విదేశాంగ శాఖ దీనిపై బ‌దులిచ్చింది. బంగ్లాదేశ్‌లో వ‌ర‌ద‌లు డంబూరు డ్యాం గేట్లు ఎత్త‌డం వ‌ల్ల రాలేద‌ని సాక్షాల‌తో స‌హా చూపించింది. బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుకి 120 కిలోమీట‌ర్ల దూరంలో డంబూర్ డ్యాం ఉంద‌ని.. దాని వ‌ల్ల వ‌ర‌ద‌లు సంభ‌వించే ప్ర‌సక్తే లేద‌ని వెల్లడించింది.

క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయే త‌ప్ప డ్యాం వ‌ల్ల కాద‌ని.. మాటిమాటికీ భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని విదేశాంగ శాఖ హెచ్చ‌రించింది. బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు భార‌త్ ఆశ్ర‌యం క‌ల్పించ‌డంతో కావాల‌ని బంగ్లాదేశ్ ఏదో ఒక ర‌కంగా భార‌త్‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయాల‌ని చూస్తోంది. హ‌సీనాకు ఎందుకు ఆశ్ర‌యం క‌ల్పించారు అని ప్ర‌శ్నిస్తోంది. ఆమె చేసిన త‌ప్పుల‌కు బంగ్లాదేశ్ కోర్టుల్లోనే తేల్చుకోవాల‌ని.. భార‌త్‌లో దాక్కుంటే ఎవ‌డికి లాభం అని అంటోంది.

భార‌త్ బంగ్లా స‌రిహ‌ద్దుల నుంచి దాదాపు 54 న‌దులు ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ న‌దుల వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఇరు దేశాలు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ఎప్పుడో స‌న్నాహాలు చేసుకున్నాయి. ఇప్పుడు హ‌సీనా విష‌యంలో బంగ్లాదేశ్ వ‌ర‌ద‌ల‌కు ఇండియాదే బాధ్య‌త అని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తోంది.