Bananas: అంతరించిపోతున్న అరటి?
అరటిపండ్లు (bananas) అంతరించిపోతున్నాయా? శాస్త్రవేత్తల పరిశోధనలో నిజమేనని తేలింది. పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లు ఇక అంతరించిపోయే దశకు చేరుకోబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం కావెండిష్ (cavendish) రకానికి చెందిన అరటి పండ్లకు ట్రాపికల్ 4కి చెందిన పనామా వ్యాధి సోకిందట. అరటి పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన 47% మంది కావెండిష్ జాతికి చెందిన అరటినే ఎక్కువగా తింటారు. ఈ పనామా (panama infection) అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ అరటి చెట్టు మొదళ్లలో పుట్టి.. అది పండ్ల వరకు వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. (bananas)
ఒక్కసారి ఇన్‌ఫెక్షన్ సోకిందంటే మొక్కలకు ఎంత నీరుపోసినా అవి గ్రహించుకోలేవు. ఫలితంగా మొక్కలు చచ్చిపోతాయి. దీనికి ఏదైనా పరిష్కారం ఉందంటే అది అరటిని పండించే రైతుల చేతిలోనే ఉంది. ఒకే రకమైన మొక్కను కాకుండా వివిధ రకాల అరటి మొక్కలను పెంచితేనే ఇంకొన్నేళ్లలో అరటి పూర్తిగా అంతరించకుండా ఉంటుందని అంటున్నారు. ఈ పనామా ఇన్‌ఫెక్షన్ అనేది 1989లో మొదటిసారిగా తైవాన్‌లోని అరటి తోటల్లో గుర్తించారు. అది నెమ్మదిగా ఆస్ట్రేలియాకు సోకింది.
ఇక ఆస్ట్రేలియా నుంచి నెమ్మదిగా చైనా, ఇండియాకు కూడా వ్యాపించేసింది. అరటి పండ్లను అత్యధికంగా పెంచేది చైనా, ఇండియాలోనే. ఒక్కసారి ఈ పనామా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకిందంటే అది ఒక పట్టాన పోదు. కావెండిష్ అరటికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకక ముందు 1876లో గ్రోస్ మిషెల్ అనే జాతికి చెందిన అరటి చెట్లు ఈ ఇన్‌ఫెక్షన్ బారినపడ్డాయట. దాంతో 1950 నాటికి గ్రోస్ మిషెల్ జాతికి చెందిన అరటి పండ్లు పూర్తిగా అంతరించిపోయాయి. (bananas)
ఆ తర్వాత ఇప్పుడు మనం తింటున్న కావెండిష్ రకం బాగా పాపులర్ అయింది. ఇప్పుడు రైతులు కూడా ఈ రకాన్నే పండిస్తున్నారు. అయితే 1800 కాలంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆ ఇన్‌ఫెక్షన్‌ను నివారించలేకపోయారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు సైన్స్, టెక్నాలజీ కూడా వందల రెట్లు వృద్ధిచెందింది. కావెండిష్ అరటి అంతరించిపోవడానికి మరో పదేళ్లు పడుతుంది. ఈ సమయంలో ఆ ఇన్‌ఫెక్షన్‌ను ఎలా నివారించాలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.