Home Loan: ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈ త‌ప్పు చేయ‌కండి

avoid this mistake if you are taking home loan

Home Loan: సొంతింటి క‌ల నెర‌వేర్చుకోవాలంటే ఈరోజుల్లో చాలా క‌ష్టం. పెరిగిపోతున్న భూములు, ఇళ్ల రేట్ల‌తో ఈ జ‌న్మ‌లో అస‌లు సొంతిల్లు తీసుకుంటామా అనే సందేహం చాలా మందికి క‌లిగి ఉంటుంది. అయితే.. మ‌న భార‌తదేశంలో 70 నుంచి 80 శాతం మంది లోన్లు తీసుకునే సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకుంటారు. అయితే ఈ లోన్ విష‌యంలో ఈ చిన్న త‌ప్పు చేయ‌కుండా చూసుకుంటే త్వ‌ర‌గా మీ సొంతిల్లు మీదైపోతుంది. ఈ సింపుల్ ట్రిక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేంటంటే..

ఇంటి కోసం తీసుకున్న బ్యాంక్ లోన్ తీర్చేందుకు ఎంత‌కాద‌న్నా ఒక 20 ఏళ్లు ప‌డుతుంది. అయితే.. ఒక‌వేళ వ‌డ్డీ రేట్లు పెరిగిన‌ప్పుడు ఈ చిన్న త‌ప్పు చేస్తే ఆ 20 ఏళ్లు కాస్తా మ‌రో 25 నుంచి 30 ఏళ్ల‌కు పెరుగుతుంది. వ‌డ్డీ రేట్లు పెరిగిన‌ప్పుడు మనం నెల నెలా క‌ట్టే లోన్‌లో ఏ మార్పూ ఉండ‌దు కానీ.. ఆ పెరిగిన వ‌డ్డీ రేట్లు వ‌సూలు చేయ‌డానికి బ్యాంకులు నెల‌ల‌ను పెంచేస్తుంటాయి. ఈ విష‌యం మొద‌ట్లో చాలా మందికి తెలీక‌పోవ‌చ్చు. ఆ త‌ర్వాత బ్యాంకుల నుంచి ఫోన్ కాల్స్, నోటీసులు వ‌స్తుంటాయి.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు 8 శాతం వ‌డ్డీపై రూ.30 ల‌క్ష‌ల లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఈ లోన్ తీర్చ‌డానికి మీరు 20 ఏళ్లు ప‌డుతుంది అనుకుందాం. అప్పుడు మీరు క‌ట్టాల్సిన ఈఎంఐ రూ.25,093 వ‌ర‌కు ఉంటుంది. ఇలా మీరు 5 ఏళ్ల పాటు నెల నెలా ఈఎంఐ క‌డుతున్న స‌మ‌యంలోనే ఆ వ‌డ్డీ కాస్తా 11 శాతానికి పెరిగింద‌నుకోండి.. అప్పుడు మీరు క‌ట్టాల్సిన ఈఎంఐ కూడా పెరుగుతుంది. ఈ విష‌యం మీకు బ్యాంక్ నేరుగా చెప్ప‌దు. అలా చెప్ప‌కుండా.. లోన్ తీర్చే గ‌డువును పెంచుతున్న‌ట్లు చెప్తుంది. అంటే మీరు 20 ఏళ్లు క‌ట్టాల్సిన లోన్ కాస్తా 11 శాతం వ‌ర‌కు వ‌డ్డీ పెర‌గ‌డంతో మ‌రో 15 సంవ‌త్స‌రాలు క‌ట్టాల్సిన ఈఎంఐ కాస్తా 8 ఏళ్లు పొడిగిస్తూ మొత్తంగా 28 సంవ‌త్స‌రాల పాటు మీరు ఈఎంఐ చెల్లిస్తూ ఉండాల్సి వ‌స్తుంది.

మ‌రి ఇలాంటప్పుడు ఏం చేయాలి?

సింపుల్.. ఒక‌వేళ వ‌డ్డీ రేట్లు పెరిగాయ‌ని మీకు తెలిసింద‌నుకోండి.. వెంట‌నే మీరు లోన్ తీసుకున్న బ్యాంక్‌ణు సంప్ర‌దించి.. మీరు నెల నెలా క‌డుతున్న ఈఎంఐని పెరిగిన వ‌డ్డీ రేటుతో క‌లిపి చెల్లిస్తాన‌ని చెప్పండి. ఇలా చేస్తే మీరు 20 ఏళ్ల‌లోనే లోన్ తీర్చేసే అవ‌కాశం ఉంటుంది. అంటే.. పైన చెప్పిన ఉదాహ‌ర‌ణ‌లో మీరు నెల నెలా రూ.25,093 చెల్లిస్తున్న‌ప్పుడు వ‌డ్డీ రేట్లు 11 శాతానికి పెరిగితే.. వ‌డ్డీ రేటు పెరిగిన నెల నుంచి మీరు ఈఎంఐ రూ. 29,500 క‌ట్టాల్సి ఉంటుంది. ఇలాగైతేనే మీరు అనుకున్న స‌మ‌యానికే లోన్ తీర్చేయ‌గ‌లుగుతారు.