Australia: ఇక స్టూడెంట్ వీసాలు మ‌రింత క‌ఠిన‌త‌రం

Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాల జారీ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ విద్యార్ధులు, త‌క్కువ నైపుణ్యం క‌లిగిన ఉద్యోగుల విసా ప్రాసెస్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌నుంది. త‌దుప‌రి రెండేళ్ల‌లో వ‌ల‌స‌దారుల సంఖ్య‌ను త‌గ్గించుకునేందుకు ఆస్ట్రేలియా ఈ నిర్ణ‌యం తీసుకుంది. 2022 నుంచి 2023 వ‌ర‌కు ఆస్ట్రేలియాకు వ‌స్తున్న విదేశీ విద్యార్ధుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

వీసాల జారీ ప్ర‌క్రియ‌లో భాగంగా విద్యార్ధుల‌కు ఇంగ్లీష్ టెస్టింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం.. ఉద్యోగాల కోసం వ‌చ్చే వారికి కొత్త నిబంధ‌న‌లతో ఒక వారంలో స్పెష‌లిస్ట్ వీసాలు జారీ చేయ‌డం వంటివి చేయ‌నున్న‌ట్లు ఆస్ట్రేలియా హోం మంత్రి క్లార్ ఓనీల్ వెల్ల‌డించారు. కోవిడ్ 19 కారణంగా అక్క‌డ ప‌నిచేసేవారు త‌క్కువ అయిపోవ‌డంతో మైగ్రేష‌న్ సంఖ్య‌ను ఆస్ట్రేలియా అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ మైగ్రేష‌న్‌ను సాధార‌ణ స్థాయికి తీసుకురావాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంటోనీ ఆల్బ‌నీస్ వెల్లడించారు.