ఫాస్టాగ్ కథ ముగిసినట్లే.. త్వరలో GPS టోల్ కలెక్షన్
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను కొన్నాళ్ల కిందట ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విధానాన్ని కూడా మార్చి.. దీని స్థానంలో అధునాతన సాంకేతికతతో కూడిన వ్యవస్థను టోల్ ప్లాజాల వద్ద తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ (cii) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పలు విషయాలను తెలియజేశారు.
ఆరు నెలల్లో టోల్ గేట్ల వద్ద కొత్త విధానం..
రానున్న ఆరునెలల్లో దేశంలోని అన్నీ టోల్ ప్లాజాల వద్ద.. జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గడ్కరీ చెప్పారు. కొత్త టోల్ కలెక్షన్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో పాటు.. వాహనదారులు ప్రయాణించిన దూరాన్ని బట్టి కచ్చితమైన టోల్ ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ జీపీఎస్- ఆధారిత వ్యవస్థ ప్రైలెట్ ప్రాజెక్ట్ కింద పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల్ని ఆపివేయకుండా.. వాహనాల నెంబర్ ప్లేట్లపై నంబర్లను గుర్తించే టెక్నాలజీపై పనిచేస్తోన్నట్లు తెలిపారు. ఇక టోల్ ఫీజు వసూళ్ల ద్వారా నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియాకు ఏడాదికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని, మరో 2-3 ఏళ్లలో రూ.1.40లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు.
జీపీఎస్ ఎలా పనిచేస్తుందంటే..
జీపీఎస్ ఆధారిత సిస్టమ్ ఇప్పటికే అనేక దేశాల్లో టోల్ వసూళ్లకు వినియోగిస్తున్నారు. టోల్ గేట్ వద్ద ఉన్న ఉండే కెమెరాను వినియోగించి వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేస్తారు. ఇది కెమెరాలో అప్పటికే ఇన్‌స్టాల్ చేసిన జీపీఎస్‌ను ఉపయోగించుకుని ఆ వాహనం హైవేపై ఎంత దూరం ప్రయాణించింది అనేది చెబుతుంది. దీని ద్వారా టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత వాడుతున్న ఫాస్టాగ్‌లో కారు విండ్ షీల్డ్‌పై ఒక కోడ్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దీన్ని ప్రతి టోల్ ప్లాజా వద్ద స్కానర్ ద్వారా పరిశీలించి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ విధానం కూడా కొంత ఆలస్యం అవుతుండటంతో జీపీఎస్ టెక్నాలజీని టోల్ గేట్ల వద్ద తీసుకువస్తున్నట్లు మంత్రి గడ్కరీ వివరించారు.