Apple దాప‌రికం.. బ‌య‌ట‌పెట్టిన ఫ్రాన్స్

అతిపెద్ద టెక్ సంస్థ యాపిల్ (apple) ఐఫోన్ 12 విష‌యంలో దాచిన విష‌యాన్ని ఫ్రాన్స్ (france) బ‌య‌ట‌పెట్టింది. ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12ను బ్యాన్ చేసారు. ఇందుకు కార‌ణం దాని నుంచి విప‌రీతంగా రేడియేషన్ రిలీజ్ అవుతోంద‌ని ఫ్రాన్స్ ఆరోపించింది. అయితే ఈ విష‌యంలో యాపిల్ త‌మ ఉద్యోగుల నోరు మూయించింద‌ట‌. క‌స్ట‌మ‌ర్లు రేడియేష‌న్ గురించి ప్ర‌శ్న‌లు అడిగితే తెలీద‌ని చెప్ప‌మ‌ని ఆదేశాలు జారీ చేసింద‌ని ఫ్రాన్స్ త‌మ నివేదిక‌లో బ‌య‌ట‌పెట్టింది. అంతేకాదు.. ఫోన్ కొన్న రెండు వారాల్లో రిట‌ర్న్ కానీ ఎక్స్‌చేంజ్ కానీ చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు యాపిల్ రూల్స్‌లో ఉన్నాయి. కానీ ఐఫోన్ 12 విష‌యంలో మాత్రం రిటర్నులు, ఎక్స్‌చేంజ్‌లకు అనుమతించ‌ద్ద‌ని కూడా యాపిల్ త‌మ ఉద్యోగుల‌ను ఆదేశించింద‌ట‌. (apple)

అయితే యూరోపియ‌న్ యూనియ‌న్ స్టాండ‌ర్స్‌కి మించి ఐఫోన్ 12 నుంచి రేడియేష‌న్ వెలువ‌డుతున్న‌ప్ప‌టికీ.. అది అంత ప్ర‌మాద‌క‌రం అయితే కాద‌ని ఫ్రాన్స్ డిజిట‌ల్ మినిస్టర్ తెలిపారు. ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌డానికి యాపిల్‌కి కేవ‌లం 2 వారాలు చాల‌ని.. ఒక సాఫ్ట్‌వేర్ అప్డేట్‌తో ఈ రేడియేష‌న్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టొచ్చ‌ని తెలిపారు. ఫ్రాన్స్ ఆరోప‌ణ‌ల‌పై యాపిల్ సంస్థ స్పందిస్తూ.. త్వ‌ర‌లో వారు చేస్తున్న‌వి కేవ‌లం ఆరోప‌ణ‌లేన‌ని.. ఐఫోన్ 12 త‌యారీ యూరోపియ‌న్ స్టాండ‌ర్డ్స్ రూల్ ప్ర‌కారమే ఉంద‌ని నిరూపిస్తామ‌ని వెల్ల‌డించింది.

ఫ్రాన్స్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బెల్జియంలో కూడా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆ దేశం గ‌గ్గోలుపెడుతోంది. వినియోగ‌దారుల‌కు ఏవైనా స‌మ‌స్య‌లు వ‌స్తాయా అనే విష‌యంపై ప‌రిశోధ‌న‌లు చేసి నివేదిక ఇవ్వాల‌ని అక్క‌డి డిజిట‌ల్ మంత్రి టెలికాం రెగ్యులేట‌ర్‌కు ఆదేశాలు జారీ చేసారు. జ‌ర్మ‌నీ, డ‌చ్ దేశాలు కూడా త‌మ టెలికాం ఆప‌రేట‌ర్ల ద్వారా ఐఫోన్ 12 నుంచి వెలువ‌డుతున్న రేడియేష‌న్ స‌మ‌స్య‌ల‌పై విచార‌ణ చేప‌డ‌తామ‌ని తెలిపాయి. యాపిల్ సంస్థ ఐఫోన్ 12ను 2020లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు 15 మోడ‌ల్ రిలీజ్ అయిన నేప‌థ్యంలో 12 మోడ‌ల్ ప్రొడ‌క్ష‌న్ ఆపేయాల‌ని నిర్ణ‌యించింది.