Rameswaram Cafe Blast: అసలేం జరిగింది? ఎలా జరిగింది?
Rameswaram Cafe Blast: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రసిద్ధమైన రామేశ్వరం కెఫెలో నిన్న జరిగిన పేలుడు ఘటనతో కన్నడ వాసులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనలో దాదాపు పది మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం వంటివి జరగలేదు. అసలు ఈ పేలుడు ఎలా సంభవించింది.. బాంబు పేలుడా.. లేక సిలిండర్ పేలిందా.. వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.
ఈ రామేశ్వరం కెఫె బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉంది. నిన్న మధ్యాహ్నం దాదాపు 1 గంట సమయంలో పేలుడు సంభవించింది. ముందు అంతా సిలిండర్ పేలిందని అనుకున్నారు. కానీ ఇది బాంబు పేలుడని పోలీసులు వచ్చి విచారణ చేపట్టిన తర్వాత తేలింది. దాంతో వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigative Agency) రంగంలోకి దిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిందంటే విషయం చాలా సీరియస్ అని అర్థం చేసుకోవాలి. (Rameswaram Cafe Blast)
సీసీటీవీలో పట్టుబడ్డ నిందితుడు
పేలుడు సంభవించిన అనంతరం అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ సిబ్బంది కెఫెలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పేలుడు సంభవించడానికి ఒక గంట ముందు ఆ వ్యక్తి కెఫె వద్ద ఓ బ్యాగ్ వదిలి వెళ్లాడు. IED (ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) అనే పేలుడు పదార్థాన్ని పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడితో పాటు ఉన్న మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వివరాలను అతని నుంచి సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా మాస్క్, టోపీ పెట్టుకుని కళ్లద్దాలు పెట్టుకున్నాడు. అతని చేతిలో ఇడ్లీలు ఉన్న ప్లేట్ కూడా గుర్తించారు.
దీనిని రాజకీయం చేయొద్దు: సీఎం
ఈ ఘటనను దయచేసి ఎవ్వరూ రాజకీయం చేయొద్దని రిక్వెస్ట్ చేసారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (Siddaramaiah). విచారణకు అందరూ సహకరించాలని అప్పుడు మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) ఘటనాస్థలికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. నిందితుడి వయసు 28 నుంచి 30 వరకు ఉంటాయని.. అతను కెఫె కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లి కొనుక్కుని కస్టమర్‌లా నటించి అక్కడే ఉన్న చెట్టు వద్ద పేలుడు పదార్థం ఉన్న బ్యాగ్ పెట్టి వెళ్లిపోయాడని శివకుమార్ తెలిపారు. రంగంలోకి సెంట్రల్ క్రైం బ్రాంచ్ కూడా దిగి విచారణ చేపడుతోంది. నిందితుల కోసం ప్రతి గల్లీ గాలిస్తోంది. ఈ పేలుడు ఘటనలో ఒకరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని స్టేట్ పోలీస్ చీఫ్ అలోక్ మోహన్ తెలిపారు.
రామేశ్వరం కెఫె సహ వ్యవస్థాపకురాలు దివ్య రాఘవేంద్రరావు (Divya Raghavendra Rao) మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. తనకు మొదట అందిన సమాచారం ప్రకారం పేలుడు వంట గదిలో సంభవించినట్లు తెలిసిందని అన్నారు. తీరా చూస్తే కిచెన్‌లో ఎలాంటి పేలుడు జరిగిన ఆనవాళ్లు కానీ రక్తం కానీ లేకపోవడం చూసి అనుమానం వచ్చిందని కస్టమర్లు కూర్చుని తినే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సీసీటీవీ ద్వారానే తమకు తెలిసిందని పేర్కొన్నారు. పోలీసులకు, విచారణ సంస్థలకు ఎలాంటి వివరాలు కావాలన్నా విచారణకు పూర్తిగా సహకరిస్తామని.. తమకు ఎంతో కీలకమైన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ బ్రాంచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు.