Patanjali ప‌టాపంచ‌లు.. అస‌లు ఏం జ‌రిగింది?

Patanjali: మా దగ్గ‌ర అన్ని వ‌స్తువుల‌ను సేంద్రీయ ప‌ద్ధ‌తిలోనే త‌యారుచేసాం. మా ఉత్ప‌త్తుల‌ను వాడితే కోవిడ్ కూడా ప‌రుగులు తీయాల్సిందే అంటూ తెగ డ‌ప్పులు కొట్టుకున్న ప‌తంజ‌లి సంస్థ ఇప్పుడు ప‌టాపంచ‌లు అయిపోయింది. ఏకంగా సుప్రీంకోర్టే చీల్చి చెండాడ‌తాం అని బెదిరించేంత‌గా దిగ‌జారిపోయింది. ఒక‌ప్పుడు అత్య‌ధిక విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన ఈ బ్రాండ్‌కు ఇప్పుడు ఏం జ‌రిగింది? ఎందుకు పతంజ‌లి సుప్రీంకోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది? చీల్చి చెండాడ‌తాం అని సుప్రీం కోర్టు ఎందుకు పతంజ‌లికి మొటిక్కాయ‌లు వేసింది?

హ‌రిద్వార‌కు చెందిన ఈ పతంజ‌లి సంస్థ‌ను యోగా గురువు అయిన బాబా రామ్‌దేవ్ (Baba Ramdev), ఆయ‌న స‌న్నిహితుడు బాల‌కృష్ణ క‌లిసి ప్రారంభించారు. ఫిబ్ర‌వ‌రి 2021లో.. అంటే కోవిడ్ డెల్టా వేవ్ అప్పుడ‌ప్పుడే ప్రారంభం అవుతున్న స‌మ‌యంలో పతంజ‌లి కోరోనిల్ అనే ఔష‌దాన్ని మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇది వాడితే కోవిడ్ 19 పూర్తిగా న‌యం అయిపోతుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. పైగా భార‌త‌దేశంలోనే కోవిడ్‌ను అంత‌మొందించే ఔష‌దాన్ని తాము త‌యారుచేసామ‌ని గొప్ప‌లు చెప్పుకుంది.

ఈ కోరోనిల్‌లో వాడిన ప‌దార్థాల‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆమోదం తెలిపింద‌ని వెల్ల‌డించింది. దాంతో వెంట‌నే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌తినిధులు ఈ అంశంపై స్పందిస్తూ అస‌లు ప‌తంజ‌లి త‌మ నుంచి ఎలాంటి ఆమోదం పొంద‌లేద‌ని పేర్కొన‌డంతో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (IMA) అలెర్ట్ అయ్యింది. అస‌లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం పొంద‌ని పతంజ‌లి ఉత్ప‌త్తిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎలా ప్రారంభించార‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ తీవ్రంగా ఖండించింది. (Patanjali)

ఆ త‌ర్వాత రామ్‌దేవ్ బాబా ఓ వీడియో పోస్ట్ చేసారు. ఈ అల్లోప‌తి మందుల వల్లే కోవిడ్ బాధితులు చ‌నిపోయార‌ని అల్లోప‌తి వైద్యం వేస్ట్ అని షాకింగ్ కామెంట్స్ చేసారు. దాంతో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని నోటీసులు పంపింది. అప్పుడు ప‌తంజ‌లి సంస్థ స్పందిస్తూ.. త‌న‌కు వ‌చ్చిన వాట్సాప్ మెసేజ్‌ని మాత్ర‌మే రామ్‌దేవ్ బాబా చ‌దివార‌ని.. అవి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కావ‌ని త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేసింది.

2022లో ప‌తంజ‌లి ఓ వార్త‌ను ప్రచురించింది. అల్లోప‌తి అంతా మోస‌మే అని ఆయుర్వేద‌మే బెస్ట్ అని ఆ వార్త‌లో పేర్కొంది. దాంతో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ సుప్రీంకోర్టులో పతంజ‌లిపై పిటిషన్ వేసింది. పైగా త‌మ ఉత్ప‌త్తుల‌తో బీపీ. షుగ‌ర్, లివ‌ర్ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయ‌ని త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేయించింది. దాంతో 2023లో సుప్రీంకోర్టు ప‌తంజ‌లికి వార్నింగ్ ఇస్తూ నోటీసులు పంపింది. ఇంకోసారి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు వేస్తే భారీ జ‌రిమానాలు విధించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొంది. దాంతో పతంజ‌లి సంస్థ తాము ఇంకెప్పుడూ ఎలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేయబోమ‌ని సుప్రీంకోర్టుకు వెల్ల‌డించింది. దాంతో విష‌యం అక్క‌డితో ముగిసిపోయింది.

మ‌రి ఇప్పుడు ఏం జ‌రిగింది?

అంతా స‌వ్యంగానే ఉంద‌నుకునే స‌మ‌యంలో ఈ ఏడాది జ‌న‌వ‌రి 15న భార‌త ప్ర‌ధాన న్యాయమూర్తి డీవై చంద్ర‌చూడ్‌కు ఓ లేఖ అందింది. ఆ లేఖ‌లో ప‌తంజ‌లి ఇప్ప‌టికీ మిస్‌లీడ్ చేసే ప్ర‌క‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని వెంటనే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాసుంది. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్ సీనియ‌ర్ అడ్వ‌కేట్ అయిన ప‌ట్వాలియా 2023 న‌వంబ‌ర్‌లో ప‌తంజ‌లి వేయించిన త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ను సుప్రీంకోర్టుకు స‌బ్మిట్ చేసారు.

దాంతో సుప్రీంకోర్టుకు ఒళ్లు మండింది. నోటీసుల‌ను ఉల్లంఘించార‌ని పేర్కొంటూ ప‌తంజ‌లి దేశాన్ని ఓ ఆట ఆడిస్తుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోంది అని మండిప‌డింది. వెంట‌నే దీనికి స‌మాధానం ఇవ్వాల‌ని ప‌తంజ‌లి సంస్థ‌కు నోటీసులు పంప‌గా.. రామ్‌దేవ్ బాబా, బాల‌కృష్ణ‌లు త‌మ‌ను ఈ ఒక్క‌సారికి క్ష‌మించి వ‌దిలేయాల‌ని కోర్టును కోరారు. వారి క్ష‌మాప‌ణ‌లను కోర్టు అంగీక‌రించ‌లేదు. మిమ్మ‌ల్ని చీల్చి చెండాడ‌తాం.. మీ విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటామో వేచి చూడండి అని వార్నింగ్ ఇచ్చింది.

వెంట‌నే అఫిడ‌విట్లు కోర్టుకు స‌బ్మిట్ చేయాల‌ని ఆదేశించింది. అయితే పతంజ‌లి సంస్థ ఆ అఫిడ‌విట్ల‌ను ముందు కోర్టుకు చూపించ‌కుండా మీడియా ముందు ఉంచింది. దాంతో సుప్రీంకోర్టు ప‌తంజ‌లి విష‌యంలో ఆగ్ర‌హంగా ఉంది. క‌చ్చితంగా పతంజ‌లి సంస్థ తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. (Patanjali)