New Shepherd: మనల్ని స్పేస్‌లోకి తీసుకెళ్లే టూరిజం స్పేస్‌క్రాఫ్ట్ గురించి తెలుసా?
New Shepherd: టూరిజం బస్సుల గురించి విన్నాం. కానీ టూరిజం స్పేస్‌క్రాఫ్ట్ గురించి తెలుసా? పై ఫోటోలో కనిపిస్తోందే.. అదే టూరిజం స్పేస్‌క్రాఫ్ట్. అంటే మనుషుల్ని నేరుగా స్పేస్‌లోకి తీసుకెళ్తుందన్నమాట. దీని పేరు న్యూ షెపర్డ్. అమెరికాకు చెందిన ప్రముఖ ఏరో స్పేస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది. ఇందుకోసం భారతదేశానికి చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీతో (SERA) ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా భారతీయులు కూడా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి టూర్ వేసి రావచ్చు. ఈ జర్నీ ద్వారా కార్మాన్ లైన్ దాటి వెళ్లచ్చు. భూమి నుంచి 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రదేశాన్ని కార్మాన్ లైన్ అంటారు. ఈ ట్రిప్ నిడివి 11 నిమిషాల పాటు ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులకు అసలు తమ బరువే తెలీకుండాపోతుంది. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు ప్రతి ప్యాసెంజర్‌కు విండో సీటు లభిస్తుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇప్పటివరకు ఏ స్పేస్‌క్రాఫ్ట్‌లో లేనంత పెద్ద కిటికీలను ఏర్పాటుచేసారు.
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ కూడా ఉంది. పైలట్లు లేకుండా సొంతంగా అన్ని ఆపరేషన్స్ చేసుకోగలదు. ఇది నాసాకు చెందిన కాలేజీలు, యూనివర్సిటీలకు పేలోడ్స్‌ను కూడా మోసుకెళ్లింది. ఇంతకీ దీనికి షెపర్డ్ అని ఎందుకు పేరు పెట్టారంటే.. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి అమెరికన్ ఆలన్ షెపర్డ్ గుర్తుగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కి న్యూ షెపర్డ్ అని పేరు పెట్టారు. అన్నట్లు.. ఈ బ్లూ ఆరిజిన్ సంస్థ ఎవరిదో కాదు.. అమెజాన్ సంస్థల అధినేత జెఫ్ బేజోస్‌ది.