Apple Mac: సగం కొరికిన యాపిల్ లోగో కథేంటి? ఆ సగం ముక్క ఎక్కడికి పోయింది?
Apple Mac: నలుగురికీ నచ్చనిది నాకసలే ఇక నచ్చదురో.. అని సూపర్‌స్టార్ మహేష్ బాబు పాడిన పాటను టెక్ దిగ్గజం యాపిల్ కాస్త సీరియస్‌గా తీసుకుంది. యాపిల్ సంస్థ కూడా టక్కరి దొంగలో మహేష్ బాబు టైపే. ఎందుకంటే.. ఇతర విండోస్, యాండ్రాయిడ్ లాగా కాకుండా యాపిల్ కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. అందుకే యాపిల్ సంస్థ తమ కంపెనీ లోగో కింద థింక్ డిఫరెంట్ అనే శీర్షికను పెట్టుకుంది. యాపిల్ లోగోలో యాపిల్ పండుని సగం కొరికినట్లు ఉంటుంది. దీనిని మీరు గమనించే ఉంటారు. అయితే ఆ ముక్క ఎక్కడికి పోయింది? సగం కొరికిన యాపిల్‌నే లోగోగా ఎందుకు పెట్టుకుంది? ఈ విషయాలను తెలుసుకుందాం.
1977లో అమెరికాకి చెందిన రాబ్ జానాఫ్ ఈ సగం కొరికిన యాపిల్‌ను లోగోగా పెడితే బాగుంటుందని యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నాయిక్‌లకు సలహా ఇచ్చారు. ఇదేదో బాగుందని వారు కూడా లోగోని ఓకే చేసేసారు.
జానాఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టీవ్ జాబ్స్ తనకు ఓ పని అప్పగించారట. ఇంకా యాపిల్ సంస్థ గురించి ప్రపంచానికి తెలీక ముందు కంపెనీకి ఒక లోగో క్రియేట్ చేయాలని.. దానిని చూడగానే కాస్త నవ్వొచ్చేలా ఆలోచింపజేసేలా ఉండాలని కోరారట. అలా సగం కొరికిన యాపిల్ ఆలోచన తనకు తట్టిందట.
అయితే.. ఆ యాపిల్ లోగోని పూర్తి యాపిల్ కనిపించేలాగే పెట్టాలనుకున్నారట. కానీ కాస్త దూరం నుంచి చూస్తే యాపిల్ లోగో కాస్తా చెర్రీ పండు, టొమాటో లాగా కనిపించిందట. కస్టమర్లు కన్‌ఫ్యూజ్ అవుతారని.. సగం ముక్క కొరికిన లోగోను డిజైన్ చేసారు. ఈ లోగోను చూడగానే యాపిల్ అని గుర్తుపట్టేలా ఉండటంతో దానికే ఫిక్స్ అయిపోయారు.
ఈ సగం కొరికిన యాపిల్ లోగో వెనుక మరో కథ కూడా ఉంది. బైబిల్ ప్రకారం.. ఏసు ప్రభువు సృష్టించిన మొదటి మనిషి ఆడమ్ అట. ఆ తర్వాత మగాడికి ఒక ఆడదాని తోడు కావాలని ఆడమ్ పక్కటెముక నుంచి ఈవ్ అనే ఓ అమ్మాయిని సృష్టించాడట. ఈ ఆడమ్, ఈవ్‌లు కలిసి ఈడెన్ గార్డెన్‌లో నివసించేవారట. ఈ గార్డెన్‌లో ఎన్నో చెట్లు, రుచికరమైన పండ్లు, అందమైన పువ్వులతో నిండి ఉండేది. అప్పుడు ఏసు ప్రభు ఆడమ్, ఈవ్‌కి ఓ మాట చెప్పారట. గార్డెన్‌లోని ఏ చెట్టు నుంచైనా ఏ పండునైనా తినచ్చు కానీ ఒక్క చెట్టు నుంచి మాత్రం ఎలాంటి పండుని తినకూడదు అని. ఒకవేళ తెలిసో తెలీకో తింటే చనిపోతారని కూడా చెప్తాడు.
అ నేపథ్యంలో ఓ పాము ఈవ్‌కి మాయమాటలు చెప్తుంది. ఏ చెట్టు నుంచైతే పండు తింటారో అది మరణానికి దారితీస్తుంది అనడం పెద్ద అబద్ధం అని.. ఆ పండుని తింటే దేవుడి లాగా జ్ఞానం, మేధస్సు, తెలివి వస్తాయని ఈవ్‌కి చెప్తుంది. అలా ఈవ్ తినకూడని పండు కోసి కొంచెం తను తిని మిగతాది ఆడమ్‌కు ఇస్తుంది. అది తిన్నాక వారి దుస్తులన్నీ మాయమైపోతాయి. నగ్నంగా ఉండటంతో వెంటనే ఆకులను తీసి దుస్తులుగా కట్టుకుంటారు.
దేవుడికి వారు తినద్దని చెప్పిన పండు తిన్నారని తెలిసి కోపం వస్తుంది. అలా ఆడమ్ ఈవ్‌ని తిడతాడు. ఈవ్ తనకు మాయమాటలు చెప్పిన పాముని తిడుతుంది. అలా దేవుడు ఆ పాముకి ఓ శాపం పెడతాడు. ఇక నుంచి పాములన్నీ కడుపు నేలకు రాస్తూ పాకాల్సిందే అని. ఇక పాము మాటలు విన్న ఈవ్‌కి కడుపున పడ్డ బిడ్డ ద్వారా కష్టాలు వస్తాయి. అలా.. బైబిల్ ప్రకారం దేవుడు ఏ పండునైతే తినద్దు అని చెప్పాడో ఆ పండు యాపిల్ అని తర్వాత తెలుస్తుందట. అలా యాపిల్ పండుని యాపిల్ సంస్థ లోగోగా మార్చుకుంది. ఈ విషయాన్ని కూడా జానాఫే వెల్లడించారు.
అంటే.. ఎలాగైతే యాపిల్ పండుని తిన్నాక వారికి జ్ఞానం, తెలివి వచ్చి ఏది మంచో ఏది చెడో తెలిసిందో.. అలా ఈ లోగోతో తయారయ్యే ఉత్పత్తులు వాడి కస్టమర్లకు కూడా ఏది మంచి ప్రొడక్టో.. ఏది మంచిది కాదో తెలుస్తుందని భావించారు. అలా 1976 నుంచి 2020 వరకు యాపిల్ లోగో దాదాపు ఏడు సార్లు మారింది. కానీ ఆ సగం కొరికిన మార్క్ మాత్రం మారలేదు. 2020లో రిలీజ్ అయిన కొత్త లోగో ఇప్పటికీ కొనసాగుతోంది.