Viral News: రేప్ వ‌ల్ల పుట్టిన బిడ్డ‌తో విధి ఆడిన వింత నాట‌కం

abandoned child comes back after 30 years to get justice to mother

Viral News:  నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని క‌థ‌లు సినిమా క‌థ‌ల‌ను త‌ల‌పించేలా ఉంటాయి. అలాంటి క‌థే ఇది. అత్యాచారం వ‌ల్ల క‌లిగిన బిడ్డ‌ను త‌ల్లి వ‌దిలేస్తే.. అత‌నితో విధి ఆడించిన‌ వింత నాట‌కమే ఈ క‌థ‌నం.

అస‌లేం జరిగింది?

అది 1991. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని హ‌ర్దోయ్ జిల్లాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలిక‌ను చ‌దువు నిమిత్తం త‌న కుటుంబం షాజ‌హాన్‌పూర్ జిల్లాకు తీసుకెళ్లింది. బాలిక‌తో పాటు ఆమె తల్లి, అక్క‌, బావ ఒకే ఇంట్లో ఉండేవారు. తల్లి, అక్క‌, బావ ఏవో చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ బాలిక ఆడుతూ పాడుతూ రోజూ స్కూల్‌కి వెళ్తుండేది. అయితే ఆమె స్కూల్‌కి వెళ్తున్న స‌మ‌యంలో కొంద‌రు ఆక‌తాయిలు అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్స్ చేసేవారు. దాంతో ఓసారి విసిగిపోయి ఈ విష‌యాన్ని త‌న అక్క, బావ‌కు చెప్పుకుంది. దాంతో వారు పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల‌కు ఫిర్యాదు చేసారు. వారేమో అలాంటిదేమీ లేదే అని తీసిపారేసారు. దాంతో చేసేదేమీ లేక ఆ కామెంట్స్ భ‌రిస్తూ బాలిక స్కూల్‌కి వెళ్తుండేది.

ఓసారి బాలిక ఉండే ఇంటిని వెతుక్కుంటూ వ‌చ్చారు ఇద్ద‌రు యువ‌కులు. అలా ఓ రోజు బాలిక ఒక్క‌త్తే ఇంట్లో ఉంది. ఈ విష‌యం తెలిసి వారు గోడ దూకి ఇంట్లోకి చొర‌బ‌డి బాలిక‌పై అత్యాచారం చేసారు. అస‌లు త‌న ప‌ట్ల అత్యాచారం జరిగింద‌న్న విష‌యం కూడా బాలిక‌కు తెలీదు. ఎవ‌రికైనా చెప్తే చంపేస్తామ‌ని బెదిరించి వారు పారిపోయారు. దాంతో ఈ విష‌యాన్ని బాలిక ఎవ్వ‌రితోనూ చెప్ప‌లేదు.

ఓసారి బాలిక‌కు అనారోగ్యం చేయ‌డంతో ఆమెను స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు బాలిక గ‌ర్భం దాల్చింద‌ని చెప్పారు. దాంతో బాలిక త‌ప్పు చేసింద‌ని భావించి పాపం బాగా కొట్టారు. దాంతో త‌న ప‌ట్ల ఇద్ద‌రు యువకులు చేసిన విష‌యాన్ని ఇంట్లో వారికి చెప్పింది. వారు వెంట‌నే ఆ యువ‌కుల ఇంటికి వెళ్లి గొడ‌వ‌ప‌డ్డారు. పోలీసుల‌కు చెప్తే చంపేస్తామ‌ని బెదిరించ‌డంతో వారు ఊరు వ‌దిలి త‌మ సొంత జిల్లా అయిన హ‌ర్దోయ్‌కి వెళ్లిపోయారు. అప్ప‌టికే బాలిక పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

దాంతో ఆ ఊర్లో వాళ్లు అస‌హ్యించుకుని బాలికను ఊరి నుంచి త‌రిమేయాల‌ని డిమాండ్ చేసారు. ఇక చేసేదేమీ లేక ఆ బిడ్డ‌ను ఓ ప్రాంతంలో వ‌దిలేసి వెళ్లిపోయారు. ఆ బిడ్డ ఉంటే బాలిక‌కు పెళ్లి కాద‌ని చెప్పారు. దాంతో ఆ బాలిక కూడా అందుకు ఒప్పుకుంది. ఆ త‌ర్వాత ఆమెకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు. అంతా బాగానే ఉంద‌నుకున్న స‌మ‌యానికి ఎవ‌రో ఆ అమ్మాయి గ‌తం గురించి ఆమె భ‌ర్త‌కు అత్తామామ‌ల‌కు చెప్పారు. దాంతో అప్ప‌టికే మ‌రో బిడ్డ‌ను క‌న్న ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టారు. ఏం చేయాలో పాలుపోక వేరే ప్రాంతానికి త‌న బిడ్డ‌ను తీసుకుని వెళ్లిపోయింది. ఓ హాస్టల్‌లో ఉంటూ చిన్నా చిత‌కా ప‌నులు చేసుకునేది.

30 ఏళ్ల త‌ర్వాత‌..

అలా 30 ఏళ్లు గ‌డిచిపోయాయి. ఓసారి బాధితురాలు ఇంట్లో ఉంటే ఓ యువ‌కుడు వ‌చ్చాడు. ఎవ‌రా అని ఆరా తీయ‌గా.. 30 ఏళ్ల క్రితం త‌న ప‌ట్ల జ‌రిగిన రేప్ వ‌ల్ల క‌లిగిన కుమారుడు అని తెలిసింది. దాంతో గుండెల‌విసేలా ఏడ్చింది. ఆ యువ‌కుడు త‌న త‌ల్లిని ఓదారుస్తూ తండ్రి గురించి అడిగాడు. తండ్రి ఎవ‌రో త‌న‌కూ తెలీద‌ని.. 30 ఏళ్ల క్రితం త‌న ప‌ట్ల అత్యాచారం జ‌రిగింద‌ని చెప్ప‌డంతో పాపం ఆ అబ్బాయి బోరున ఏడ్చాడు.

ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని 30 ఏళ్లైనా ఫ‌ర్వాలేదు. త‌న జీవితాన్ని త‌న త‌ల్లి జీవితాన్ని నాశ‌నం చేసిన ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు శిక్ష ప‌డాల్సిందే అని నిర్ణ‌యించుకున్నాడు ఆ బాలుడు. త‌న త‌ల్లిని కూడా ఒప్పించ‌డంతో వారిద్ద‌రూ ఆ వ్య‌క్తుల గురించి ఆరా తీసేందుకు షాజ‌హాన్‌పూర్ వెళ్లారు. ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒక‌రి పేరు ర‌జీ భాయ్ అని తెలిసింది. ర‌జీ భాయ్ గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. అడిగిన వారికి తాము ర‌జీ భాయ్ చుట్టాల‌మి దుబాయ్ నుంచి వ‌చ్చామ‌ని చెప్పేవారు. అత‌ని ఆచూకీ తెలిస్తే త‌మ ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేయ‌మ‌ని నెంబ‌ర్ ఇచ్చారు.

అలా రెండేళ్ల పాటు య‌త్నిస్తుండ‌గా.. ఓరోజు బాధితురాలి ఫోన్ మోగింది. తీరా చూస్తే అవ‌త‌లి వైపు ర‌జీ భాయ్‌. అత‌ని గొంతు విన‌గానే ఆ బాధితురాలికి గ‌తం గుర్తుకొచ్చింది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని అత‌ని అడ్ర‌స్ తెలుసుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల‌ను ఎంతో బ‌తిమిలాడితే కానీ వారు కేసు న‌మోదు చేసేందుకు ఒప్పుకోలేదు.

అలా కేసు కోర్టు మెట్లెక్కింది. వాదోప‌వాదాలు విన్న న్యాయ‌మూర్తి.. ఆ అబ్బాయి మీకు పుట్టిన‌వాడే అని ఎలా చెప్ప‌గ‌ల‌రు? అని ప్ర‌శ్నించాడు. అప్పుడు ఆ అబ్బాయి.. కావాలంటే డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోండి స‌ర్ అని చెప్పాడు. ఇందుకు కోర్టు అంగీక‌రించ‌గా.. ప‌రీక్ష‌లు చేసారు. అందులో ఆ బాధితురాలే యువ‌కుడి త‌ల్లి అని తెలిసింది. అలా ర‌జీ భాయ్‌ని అదుపులోకి తీసుకుని విచార‌ణ‌లు చేప‌ట్ట‌గా.. మ‌రో నిందితుడైన హ‌స్స‌న్ న‌ఖీ హైద‌రాబాద్‌లో ఉంటున్నాడ‌ని తెలిసింది. అలా ఇద్ద‌రినీ లాక్కొచ్చి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. వాదోప‌వాదాలు అయ్యే స‌రికి నాలుగేళ్లు గ‌డిచింది. అలా 2024 మే 20న నిందితుల‌కు యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ల‌తో పాటు రూ.10 వేలు జ‌రిమానా విధించింది. ఇప్పుడు బాధితురాలి వ‌య‌సు 42. నిందితుల వ‌య‌సు 55, 52.