Straight From Heart: అమ్మ‌లంతా ఒకేలా ఉండ‌రు..!

ఓ త‌ల్లి కార‌ణంగా జీవితంలో ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్న ఓ 29 ఏళ్ల యువ‌తి మాకు రాసిన మెయిల్ ఇది. ఆమె ప‌ర్స‌న‌ల్ స్టోరీ ఆమె మాట‌ల్లోనే..! (straight from heart)

అమ్మ‌.. (mother) ఈ మాట విన‌గానే అంద‌రికీ మ‌ధురానుభూతి క‌లుగుతుంది. కానీ నాకు ద్వేషం, కోపం క‌ట్ట‌లు తెంచుకుంటాయి. దేవుడు అన్ని చోట్లా ఉండ‌లేడు కాబ‌ట్టే అమ్మ‌ను సృష్టించాడు అంటారు. ఇలాంటివ‌న్నీ కోట్స్‌గా రాసుకోడానికి త‌ప్ప ఎందుకూ ప‌నికిరావు. నేను అమ్మ‌లంతా త‌ప్పు అని చెప్ప‌డంలేదు. అమ్మ‌ల‌ను దైవంగా కొలుస్తూ వారు ఏ త‌ప్పు చేసినా అది క‌రెక్ట్ అని వెన‌కేసుకొచ్చి కొత్త రూల్స్‌ని సొసైటీపై రుద్ద‌కండి అని చెప్తున్నాను. నాకు చిన్న‌ప్పుడే నాన్న పోయారు. ఆ త‌ర్వాత నా బాధ్య‌త‌ను మా తాత‌గారు (అమ్మ వాళ్ల సైడ్) చేర‌దీసి పెంచారు. మా అమ్మ వాళ్ల అక్క ఇంట్లో ఉండేది. నేను తాత‌గారు, అమ్మ‌మ్మ‌ల ద‌గ్గ‌ర ఉండేదాన్ని.

మా అమ్మ‌ను మా పెద్ద‌మ్మ బాగానే చూసుకునేది. పెద్ద‌మ్మ వాళ్ల భ‌ర్త చ‌నిపోవ‌డంతో మా అమ్మ తోడుగా ఉండేది. కానీ మా అమ్మ‌కు చ‌దువులేదు. అలాంట‌ప్పుడు సైలెంట్‌గా మా పెద్ద‌మ్మ వండి పెడుతున్న‌ప్పుడు హాయిగా ఉండాల్సింది. కానీ మా అమ్మ అలా చేయ‌లేదు. ప‌రాయి స్త్రీ భ‌ర్త‌ను వ‌ల్లో వేసుకుంది. అత‌ను ఇంటికి వ‌చ్చి అవ‌స‌రం తీర్చుకుని డ‌బ్బు ఇచ్చి వెళ్తుండేవాడు. ఈ విష‌యం తెలిసేస‌రికి నేను ఇంట‌ర్‌లో ఉన్నాను. అత‌నికి ఆల్రెడీ పెళ్ల‌య్యి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్నార‌ని తెలిసి నా క‌ళ్ల‌ల్లో నీళ్లు ఆగ‌లేదు. ఈ వ‌య‌సులో ఈ ప‌నులు ఎందుకు అని మా అమ్మ‌ను అడిగితే అందులో త‌ప్పేముంది అని తేలిగ్గా అనేసింది. (straight from heart)

నేనెవ్వ‌రికీ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఆ వ్య‌క్తిని ఓసారి నాక్కూడా ప‌రిచ‌యం చేసింది. అత‌ను న‌న్ను కూతురిగానే చేర‌దీసాడు. నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అయినా కూడా అత‌న్ని నాన్న అని ఎలా అనుకోవాలి. తాత‌గారు చ‌నిపోయాక అత‌నే నాకు డిగ్రీ ఫీజ్ కట్టాడు. అది కూడా ఒక సంవ‌త్స‌రం ఫీజు. ఆ త‌ర్వాత మాస్ట‌ర్స్ చేయ‌లేక‌పోయా. ఉద్యోగం చేయాల్సిన ప‌రిస్థితి. నేను ఉద్యోగం చేస్తున్నా కూడా మా అమ్మ అత‌న్ని కలుస్తూనే ఉంది. ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. న‌న్ను చిన్న‌ప్ప‌టి నుంచి తిడుతూ కొడుతూనే పెంచింది. తిట్టడం కొట్ట‌డం సాధార‌ణ‌మే క‌దా అనుకునేదాన్ని. కానీ డిగ్రీ అయిపోయి ఉద్యోగానికి వ‌చ్చినా కూడా నా జీవితం నా చేతుల్లో లేకుండాపోయింది. నాకు జీతం వ‌చ్చే రోజు బాగానే మాట్లాడుతూ.. జీతం డ‌బ్బులు తీసుకున్నాక అస‌భ్య‌క‌రంగా మాట్లాడేది. ఓసారి ఏదో గొడ‌వ అవ్వ‌డంతో.. నువ్వు మాకు ఏటీఎం లాంటి దానివి అనేసింది.

నాకు ఏడుపు ఆగ‌లేదు. నేనెందుకు ప‌డి ఉండాలి? నా పాటికి నేను నాకు వ‌చ్చే అర‌కొర జీతంతో ఎలాగోలా బ‌తికేదాన్ని క‌దా..! పోనీ చిన్న‌ప్పుడు న‌న్ను ఎక్క‌డో ఒక చోట వ‌దిలేయాల్సింది. పిల్ల‌లు త‌ప్పు చేస్తే క‌డుపులో దాచుకుంటారు త‌ల్లిదండ్రులు. కానీ మా అమ్మ మాత్రం నేను ఏ చిన్న త‌ప్పు చేసినా అది ఎందుకు జ‌రిగింది ఎలా జ‌రిగింది అని కూడా అడిగేది కాదు. నా గురించి కుటుంబంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఫోన్లు చేసి చెడుగా చెప్పేది. మా అమ్మ నా ప‌ట్ల ఎంత హీనంగా ప్ర‌వ‌ర్తిస్తోందంటే.. ఓసారి నాకు పెళ్లి సంబంధం వ‌స్తే ఆ అబ్బాయితో మాట్లాడుతూ.. పెళ్ల‌య్యాక మా అమ్మాయిని మాత్ర‌మే కాదు న‌న్నూ చూసుకోవాలి అని చెప్పింది. దాంతో ఆ అబ్బాయి.. మీకు ఓ కొడుకు ఉన్నాడు క‌దా ఆంటీ అత‌ను చూసుకుంటాడు. పెళ్ల‌య్యాక నా కుటుంబం నాది. అప్పుడు కూడా మిమ్మ‌ల్ని చూసుకోవాలంటే ఎలా అవుతుంది అనేసి సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయాడు. (straight from heart)

అలా మంచి సంబంధం పోయింది. చేసిందంతా చేసి ఓ సారి న‌న్ను స‌రిగ్గా చూసుకోవడం లేదు కాబ‌ట్టే నీకు పెళ్లి కాకుండాపోతోంది అనేసింది. నేను సంపాదిస్తున్న డ‌బ్బు వాడుకుంటూ నా తిండి తింటూ నా గురించి ఇలా మాట్లాడేస‌రికి నాకు కోపం ఆగ‌లేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాల‌నుకున్నా. ఎక్క‌డ నేను వెళ్లిపోతే త‌న‌కు డ‌బ్బు రాకుండాపోతుందోన‌ని సారీ చెప్పి ప్రేమ‌గా న‌టించింది. నేను కూడా నమ్మాను. కానీ ఆమె బుద్ధి మార‌లేదు. నాకు ఇప్పుడు 29 ఏళ్లు. ఇప్ప‌టికీ ఇదే టార్చ‌ర్ అనుభ‌విస్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే.. ఇంత పెద్ద‌దానివి అమ్మ మీద కంప్లైంట్ ఏంటి అంటారు కానీ నా బాధ‌ను ఎవ్వ‌రూ అర్థం చేసుకోరు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. అంద‌రు త‌ల్లులూ ఒకేలా ఉండ‌రు. త‌ల్లిదండ్రుల‌ను చూసుకోవాలి అన్న మాట క‌రెక్టే. కానీ గౌర‌వం, ప్రేమ అనేవి ప‌ర‌స్ప‌రం ఉండాలి. 9 నెల‌లు మోసి క‌ని పెంచాం అన్న ఒక్క డైలాగ్ ప‌ట్టుకుని జీవితాంతం పిల్ల‌ల్ని క్షోభ‌పెట్టే త‌ల్లులు కూడా ఉన్నారు మ‌న స‌మాజంలో. కాబ‌ట్టి ఉద‌యాన్నే టీవీ ఛానెల్స్‌లో కూర్చుని త‌ల్లిదండ్రులు దైవంతో స‌మానం అని నీతులు చెప్పేవారు ఒక్క విష‌యం గుర్తుపెట్టుకోండి. త‌ల్లిదండ్రులు నిజంగానే దైవస్వ‌రూపులు అయితే.. వాళ్లు చేసిన తప్పుల‌కు కోర్టులు శిక్ష వేయ‌కుండా వ‌దిలేయాలి క‌దా? ఇటీవ‌ల ఓ చిన్నారిని దారుణంగా చంపేసిన త‌ల్లికి యావ‌జ్జీవ శిక్ష ప‌డింది. మ‌రి ఆమెను దైవంగా భావించి వ‌దిలేయాలి క‌దా..! పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల‌ను ప్రేమ‌గా చూసుకోవాల‌ని చెప్పడంలో త‌ప్పు లేదు. ఇదే మాట కాస్త త‌ల్లిదండ్రుల‌కు కూడా చెప్తే బాగుంటుంది.

                                                                                                                                                                                                                                                         -ఓ సోద‌రి