మర్డర్ కేసు విచారణ జరుగుతుండగా బతికే ఉన్నా అని ప్రత్యక్షమయ్యాడు!
Supreme Court: సుప్రీంకోర్టులో ఓ మర్డర్ కేసు విచారణ జరుగుతుండగా.. జడ్జిలకు షాకింగ్ సంఘటన ఎదురైంది. ఓ బాలుడి మర్డర్ కేసు వాదనలు జరుగుతుండగా.. నేను చనిపోలేదు సర్ బతికే ఉన్నా అనుకుంటూ ఓ బాలుడు కోర్టులో ప్రత్యక్షమయ్యాడు.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 2010లో నంద అనే వ్యక్తికి వివాహం జరిగింది. ఒక బాబు పుట్టిన తర్వాత భార్యను కట్నం కోసం వేధిస్తూ చావగొట్టేవాడు. అలా ఓసారి తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ 2013లో మరణించింది. దాంతో బాలుడిని అతని తాతగారు తీసుకెళ్లారు. అయితే బాలుడిని తనకే అప్పగించాలని నంద బెదిరించాడు. ఇందుకు ఆ పెద్దాయన ఒప్పుకోలేదు. కూతుర్ని చంపేసాడు ఇక కొడుకుని ఏం చేస్తాడో అని భయపడి ఇవ్వనన్నాడు.
దాంతో నంద తన బిడ్డను తన మామగారే చంపేసారని కేసు వేసాడు. ఇందుకోసం కుల్దీప్ అనే లాయర్‌ను పెట్టుకున్నాడు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే కేసు వాదనలు జరుగుతున్న సమయంలో ఆ బాలుడు కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. తన తాతయ్యపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని తాను బతికే ఉన్నానని కోర్టుకు చెప్పడంతో అంతా షాకయ్యారు. దాంతో తప్పుడు కేసులు బనాయించి కోర్టు సమయం వృథా చేసినందుకు న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసారు.