ఆర్థిక మాంద్యం అంచున‌ అగ్ర‌రాజ్యం.. భార‌త్‌కూ ముప్పు

అగ్ర‌రాజ్యం అమెరికా (america) త్వ‌ర‌లో ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. ఆ ప్ర‌భావం భార‌త్‌పై (india) తీవ్రంగా ఉండ‌బోతోంద‌ని ప్ర‌ముఖ టాప్ ఎక‌నామిస్ట్ నీల్‌కాంత్ మిశ్రా వెల్ల‌డించారు. త్వ‌ర‌లో అమెరికాను బ‌ల‌మైన ఆర్థిక మాంద్యం ముంచెత్త‌నుంద‌ని దీని వ‌ల్ల ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని పేర్కొన్నారు. ఐటీ, బిజినెస్ స‌ర్వీసెస్ విష‌యంలో భార‌త్ అమెరికాపై ఎంతో ఆధార‌ప‌డి ఉంది. ఒక్క‌సారి అమెరికాలో ఆర్థిక మాంద్యం మొద‌లైతే.. ఈ స‌ర్వీసుల‌న్నీ ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోతాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌ర‌గాల్సిన ఎగుమ‌తులు, దిగుమ‌తులు కూడా నిలిచిపోయే ప్ర‌మాదం ఉంది. ముఖ్యంగా భార‌త్‌కు ఎగుమ‌తుల విష‌యంలో భారీ న‌ష్టం వాటిల్ల‌నుంది. ఒక‌వేళ అమెరికా ఆర్థిక వ్య‌వస్థ గాడి త‌ప్పిన‌ప్ప‌టికీ భార‌త్ స్ట్రాంగ్‌గా ఉంటే… ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్‌ల‌ను భార‌త్‌లోనే అమ్మాల‌ని చూస్తాయి. దీని వ‌ల్ల భార‌తీయ కంపెనీలు న‌ష్ట‌పోయే ప‌రిస్థితి ఉంది. స్టాక్ మార్కెట్‌పై కూడా అమెరికా ఆర్థిక మాంద్యం తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దీని వ‌ల్ల స్టాక్స్, బాండ్స్ ఆధారంగా న‌గ‌దు తీసుకునే ఇండియ‌న్ కంపెనీల‌కు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే ఫండ్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. (america)

అమెరికాలో ఆర్థిక మాంద్యం మొద‌లైతే ముందుగా చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోతాయి. దీని వ‌ల్ల భార‌త్‌కే లాభం. ఎందుకంటే వివిధ దేశాల నుంచి అధికంగా చ‌మురు దిగుమ‌తి చేసుకునే దేశాల్లో భార‌త్ ఒక‌టి. మాంద్యం వ‌ల్ల చ‌మురు ధ‌ర‌లు పెరిగితే మాత్రం భార‌త్‌కు న‌ష్టం. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ విష‌యంలో నిల‌క‌డగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ఈ స‌మ‌యంలో ఎలాంటి రిస్క్‌లు తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని ఆర్థిక‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. ఆర్థిక మాంద్యం వ‌ల్ల భార‌త్‌లోని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పైనే ఎక్కువ ప్ర‌భావం ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌భావం నిదానంగా ఉంటుంది.