2000 నోటు ఇచ్చాడ‌ని.. పెట్రోల్ వెన‌క్కి తీసేస్కున్నాడు!

Uttarpradesh: రూ.2000 నోటు ఇచ్చాడ‌ని ఓ వ్య‌క్తి కొట్టిన పెట్రోల్‌ను వెన‌క్కి తీసేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. రూ.2000 నోట్లు వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ఆర్‌బీఐ ప్ర‌క‌టించ‌డంతో నోటును బ్యాన్ చేసార‌ని పొర‌బ‌డి అస‌లు యాక్సెప్ట్ చేయ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో ఈరోజు జ‌లావ్ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి పెట్రోల్ కొట్టించుకుని రూ.2000 ఇచ్చాడు. అది చెల్ల‌ద‌ని పెట్రోల్ కొట్టిన వ్య‌క్తి తీసుకోలేదు. చెల్లుతుంది చేంజ్ ఇవ్వండి అని అడిగినా కూడా ఒప్పుకోలేదు. దాంతో ఆ వ్య‌క్తి త‌న ద‌గ్గ‌ర రూ.2000 నోటు త‌ప్ప చిల్ల‌ర లేద‌ని చెప్పాడు. దాంతో పెట్రోల్ కొట్టిన వ్య‌క్తి కొట్టిన పెట్రోల్‌ను పైప్ పెట్టి తీసేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో పెట్రోల్ బంక్‌కు వ‌చ్చిన‌వారు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. 2000 నోటును బ్యాన్ చేయ‌లేద‌ని కేవ‌లం వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ఆర్‌బీఐ ఎన్నిసార్లు చెప్పినా కొంద‌రికి బుర్ర‌కెక్క‌డంలేదు. వారి వ‌ల్ల పలువురు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.

దాంతో పెట్రోల్ బంక్ మేనేజ‌ర్ ఈ ఘ‌ట‌న‌పై స్పందించాడు. చాలా మంది 2000 నోట్ల‌ను మార్చ‌డానికి పెట్రోల్ బంకుల‌నే వాడుకుంటున్నారని తెలిపారు. గ‌తంలో వారానికి ఒక‌టో రెండో 2000 నోట్లు వ‌చ్చేవ‌ని ఇప్పుడు రోజుకు 20 వ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని అన్నారు. త‌మ‌కు రూ.2000 నోటు తీసుకోవ‌డంలో ఇబ్బంది లేదు కానీ ఎక్కువ ధ‌ర‌కు పెట్రోల్ కొట్టించుకోకుండా మ‌రీ రూ.200కి కొట్టించుకుని కూడా చిల్ల‌ర కావాల‌ని 2000 ఇస్తున్నార‌ని అలాంటివారి నుంచి నోట్లు తీసుకోలేమ‌ని వాపోయాడు.