Viral News: ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు.. రూ.2.5 లక్షలు కోల్పోయాడు
Viral News: సైబర్ నేరాలు ఏ రేంజ్లో పెరిగిపోయాయో వివరించే సంఘటన ఇది. ఉద్యోగం ఉందని చెప్పి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్పి రూ.2.5 లక్షలు లాగేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. నవేద్ ఆలం అనే ప్రొడక్ట్ డిజైనర్‌కు ఈ ఘటన ఎదురైంది ఈ ఘటన. ఈ విషయాన్ని అతను ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాడు. ట్విటర్లో తనకు వెబ్ 3 కమ్యునికేషన్ అనే కంపెనీ నుంచి ప్రొడక్ట్ డిజైనర్ వేకెన్సీ ఉన్నట్లు మెసేజ్ వచ్చిందట. తనకు జాబ్ అవసరం ఉండటంతో నవేద్ వెంటనే అప్లై చేసాడు. వాళ్లు పెద్ద కంపెనీ లాగా బిల్డప్ ఇస్తూ వివరాలన్నీ తీసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్పి లింక్ పంపారు.
ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలే అడగడంతో నవేద్‌కు ఎలాంటి అనుమానం రాలేదు. ఆ తర్వాత హెచ్ఆర్ నుంచి ఫైనల్ కాల్ వస్తుందని చెప్పారు. అయితే హెచ్ఆర్ కాల్ రావాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారట. అంతా ఆ యాప్ ద్వారానే ప్రాసెస్ అవుతుంది అనడంతో నవేద్ ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఎప్పుడైతే యాప్‌లో తన వివరాలన్నీ నమోదు చేసాడు ఆ తర్వాత అతని ఖాతాలో ఉన్న రూ.2.5 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దాంతో తాను మోసపోయానని నవేద్ ఎంతో ఆవేదన చెందాడు. తనలా మరెవ్వరికీ కాకూడదని నవేద్ ట్విటర్ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు.