Love Story: కొంపముంచిన పాకిస్థానీ ప్రేమ
Love Story: ప్రేమ ఒక మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది.. ఎంత దాకైనా తీసుకెళ్తుంది అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ పాకిస్థానీ యువకుడు తన ప్రేమ విఫలం అవడంతో పొరపాటున భారత్‌లోకి ప్రవేశించాడు. దాంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా ఇండియా పాకిస్థాన్ బోర్డర్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో ఓ 20 ఏళ్ల కుర్రాడు తర్పార్కర్ గ్రామానికి ఎలా వెళ్లాలి? ఏ బస్సు ఎక్కాలి అని స్థానికులను అడుగుతున్నాడట. తర్పార్కర్ అనేది పాకిస్థాన్‌లోని ఓ జిల్లా. ఈ విషయం బార్మర్ జిల్లా వాసులందరికీ తెలుసు. ఆ యువకుడు అలా అడిగేసరికి పాకిస్థాన్‌కి ఎలా వెళ్లాలి అని అడుగుతున్నాడేంటి అని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దాంతో బోర్డర్ సెక్యూరిటీ బలగాలు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నాయి. భారత్‌లోకి ఎలా వచ్చావ్ అని దబాయించగా జరిగిన విషయం చెప్పాడు. ఆ అబ్బాయి పేరు జగ్సీ కోలి. పాకిస్థాన్‌లోని తర్పార్కర్ జిల్లాకు చెందిన అక్లీ ఖరోడీ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను ఓ మైనర్‌ను ప్రేమించాడట. అయితే.. ఇంట్లో వారు ఒప్పుకోరని ఆ అమ్మాయిని లేపుకుపోవాలని అనుకున్నాడు. అలా నేరుగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి లేచిపోదాం రా అని అడిగాడు. ఇందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. దాంతో ఆ పిల్ల చున్నీ లాక్కుని దాంతో ఉరేసుకుంటానని చెట్టెక్కాడు. కానీ చెట్టు కొమ్మ విరిగింది. ఈ విషయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలీడంతో ఆ అబ్బాయిని తరిమికొట్టారు. దాంతో జగ్సీ భయంతో పరిగెడుతూ… పొరపాటున బోర్డర్ దాటేసి బార్మర్ జిల్లాలోకి వచ్చేసాడు. అలా బార్మర్ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆ యువకుడిని క్షేమంగా పాకిస్థాన్‌కు పంపించే బాధ్యత తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.