Dog Walking: కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్తే 80 వేల జీతం
Dog Walking: కోవిడ్ పుణ్యమా చిత్ర విచిత్రమైన ఉద్యోగ అవకాశాలు పుట్టుకొచ్చాయి. వాటిలో డాగ్ వాకర్, డాగ్ సిట్టర్ ఒకటి. అంటే ఇతరులు పెంచుకునే కుక్కలని ఓ గంట వాకింగ్‌కి తీసుకెళ్లినా.. లేదా వాటి ఆలనా పాలనా చూసుకున్నా డబ్బులిస్తారు. ఇలాంటి ఉద్యోగాలు కల్పించే కంపెనీ మన భారతదేశంలోనూ ఉంది. అదే ది పెట్ నెస్ట్. 2019లో ఈ కంపెనీ పెట్టారు. 2020లో కోవిడ్ తర్వాత ఈ కంపెనీకి మంచి లాభాలు వచ్చాయి.
ఇలాంటి కంపెనీలు చాలానే ఉన్నప్పటికీ కేవలం టియర్ 1 ప్రాంతాల్లోనే ఈ సర్వీసులకు అధిక డిమాండ్ ఉంది. కుక్కలంటే ఇష్టం ఉన్నవారు ఈ కంపెనీ వెబ్‌సైట్లలో డాగ్ వాకర్ రోల్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అవకాశం ఉంటే పిలిచినప్పుడు వెళ్లాలి. అలా ఈ డాగ్ వాకర్లు నెలకు రూ.8 వేల నుంచి రూ.80 వేల వరకు సంపాదిస్తున్నవారు ఉన్నారట. అయితే ప్రతి ఉద్యోగానికి కాస్త శిక్షణ అనేది అవసరం. అలానే డాగ్ ట్రైనింగ్ అనేది ఎవరు పడితే వారు చేసేది కాదు. కేవలం కుక్కలంటే ఇష్టం ఉన్నవారికి అవకాశాలు ఇచ్చేయరు. వారికి సరైన ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని పరీక్షలు కూడా పెడతారు. అందులో పాస్ అయితేనే పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ వస్తుంది. ఒక కంపెనీ తరఫున డాగ్ వాకర్‌గా పనిచేయాలంటే కచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన డ్రెస్ కోడ్ ధరించాల్సిందే.
కంపెనీల ద్వారానే కాకుండా నమ్మకం ఉన్నవారు రెఫెర్ చేస్తే స్వతంత్రంగా డాగ్ వాకింగ్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నవారు బోలెడు మంది ఉన్నారు. తమ కుక్కలను ఒక మనిషిలా చూసుకుంటూ వాటికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటే వేలకు వేలు కుమ్మరించేవారు ఎందరో..! ఈ డాగ్ వాకింగ్ అనేది అమెరికా, యూకే, కెనడాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్నదే. ఇప్పుడు భారతదేశంలోని టియర్ 1 నగరాల్లో ఈ సంస్కృతి ఎక్కువ అవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్‌లోని జూబ్లీ, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ డాగ్ వాకర్లు అందుబాటులో ఉన్నారు.