Viral News: గేదె తీర్పు.. కేస్ క్లోజ్.!
Viral News: పోలీసులు, పంచాయతీ పెద్దలు తీర్చలేని సమస్య ఓ మూగ జీవి తీర్చింది. దాంతో కేసు క్లోజ్ అయ్యింది. మ్యాటర్ ఏంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్‌లోని రాయ్ అస్కారన్‌పూర్ ప్రాంతానికి చెందిన నందలాల్ అనే వ్యక్తి దగ్గర ఓ గేదె ఉంది. అది వారం రోజుల క్రితం తప్పిపోయింది. నందలాల్ ఆ గేదె కోసం మూడు రోజుల పాటు వెతకగా.. అది పురే హరికేష్ గ్రామానికి చెందిన హనుమాన్ అనే వ్యక్తి ఇంట్లో లభ్యమైంది. నందలాల్ హనుమాన్ వద్దకు వెళ్లి అది తన గేదె అని తనకు అప్పగించాలని కోరాడు. అందుకు హనుమాన్ ఒప్పుకోలేదు. అది తనకు తన పొలంలో దొరికింది కాబట్టి తన గేదే అని వారించాడు.
దాంతో నందలాల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు నందలాల్‌ను హనుమాన్‌ను పిలిపించి మాట్లాడేందుకు యత్నించారు. వారు ఎంత ప్రయత్నించినా ఆ గేదె ఎవరిదో కనుక్కోవడం కష్టమైపోయింది. దాంతో ఊరి పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. అక్కడ కూడా పరిష్కారం దొరకలేదు. దాంతో ఊరి పెద్దలు ఓ సలహా ఇచ్చారు. నందలాల్‌ను హనుమాన్‌ను వారి ఊర్ల దారి వద్ద నిలబెట్టి.. గేదెను రోడ్డు మీదకు తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు వారు ఒప్పుకున్నారు. అలా హనుమాన్ నందలాల్ తమ ఊర్లకు వెళ్లే దారుల వైపు నిలబడ్డారు. ఆ తర్వాత గేదెను తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ గేదె తన యజమాని అయిన నందలాల్ వైపు వెళ్లింది. దాంతో పోలీసులు అబద్ధం చెప్పిన హనుమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో కేసు క్లోజ్ అయ్యింది.