Isha Foundation: షాకింగ్.. స‌ద్గురు ఫౌండేష‌న్ నుంచి ఆరుగురు మిస్సింగ్

Isha Foundation: స‌ద్గురుకి చెందిన కోయింబ‌త్తూరులోని ఇషా ఫౌండేష‌న్ నుంచి ఆరుగురు వ్య‌క్తులు అదృశ్య‌మైన‌ట్లు చెన్నై పోలీసులు మ‌ద్రాస్ హైకోర్టుకు తెలిపారు. వారంతా క్షేమంగా ఇంటికి చేర‌కున్నారో లేదో తెలీలేద‌ని వెల్ల‌డించారు. 2016 నుంచి 2024 వ‌ర‌కు ఆరుగురు వ్య‌క్తులు మిస్సింగ్ అని త‌మిళ‌నాడు పోలీసులు చెప్తున్నారు. 2007లో తిరుమ‌ళై అనే వ్య‌క్తి త‌న సోద‌రుడు గ‌ణేషన్ సేవ చేసేందుకు 2007లో ఇషా ఫౌండేష‌న్‌కు వెళ్లార‌ని ఆ త‌ర్వాత అస‌లు ఇంటికి తిరిగి రాలేద‌ని మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ వేసాడు.

ఈ కేసుని విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ విష‌యం తెలిసింది. ఇషా ఫౌండేష‌న్ నుంచి కేవ‌లం గ‌ణేష‌న్ మాత్ర‌మే కాద‌ట‌.. 2016 నుంచి దాదాపు ఆరుగురు వ్య‌క్తులు అదృశ్య‌మైన‌ట్లు నివేదిక‌లో పేర్కొన్నారు. అయితే అదృశ్యమైన వారిలో కొంద‌రు తిరిగి త‌మ ఇళ్లకు చేరి ఉండొచ్చ‌ని ఈ విష‌యంలో అద‌న‌పు స‌మాచారం లేక‌పోవ‌డంతో ప‌క్కాగా చెప్ప‌లేమ‌ని కోర్టుకు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి త‌దుపరి విచార‌ణ ఏప్రిల్ 18కి వాయిదా ప‌డింది. ముందు క‌నిపించ‌కుండాపోయిన గ‌ణేషన్ గురించి ఇషా ఫౌండేష‌న్ వారే త‌న‌కు ఫోన్ ద్వారా స‌మాచారం అందించార‌ని తిరుమ‌లై కోర్టుకు తెలిపారు. ఆ త‌ర్వాతే పోలీసుల‌కు ఫిర్యాదు చేసాన‌ని పేర్కొన్నారు. దీనిపై ఇషా ఫౌండేష‌న్ స్పందిస్తూ.. ఆరుగురు అదృశ్య‌మైన విష‌యంలో ఏమాత్రం నిజం లేద‌ని వెల్ల‌డించింది.