ప్రాప‌ర్టీ కొనే ముందు ఇవి చూడ‌క‌పోతే న‌ష్ట‌పోతారు

Property: సొంతిల్లు ఉండాల‌నేది ప్ర‌తి సామాన్య మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఉండే క‌ల‌. ఇప్పుడు పెరిగిపోతున్న ధ‌ర‌ల‌తో అస‌లు జీవితంలో ఇల్లు కొంటామో లేదో అనే సందేహంలో ప‌డిపోతోంది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. ఎంత ఆదా చేసుకున్నా రోజూ పెరిగిపోతున్న ధ‌ర‌ల‌తో సొంతింటి క‌ల‌ను తీర్చుకోలేక‌పోతున్నారు చాలా మంది ఉన్నారు. ఓప‌క్క పెరుగుతున్న ధ‌ర‌లు చాల‌ద‌న్న‌ట్లు.. కొంద‌రు ఏజెంట్లు ఆల్రెడీ ఒక‌రికి అమ్మేసిన ప్రాప‌ర్టీల‌నే మోసం చేసి ఎక్కువ మొత్తానికి మ‌రొక‌రికి అమ్మేసి కుచ్చు టోపీ పెట్టి పారిపోతున్నారు. అందుకే ప్రాప‌ర్టీ కానీ ల్యాండ్ కానీ కొనే ముందు ఈ అంశాల‌ను క‌చ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే.

టైటిల్ డీడ్

మ‌నం ఎవ‌రి నుంచైతే ప్రాప‌ర్టీ కొనుగోలు చేస్తున్నామో ఆ ప్రాప‌ర్టీకి య‌జ‌మాని ఎవ‌రు అనేది క‌చ్చితంగా ముందు తెలుసుకోవాల్సిన అంశం. ఆ య‌జ‌మాని వివ‌రాలు తెలిసాక అత‌నికి ఆ ప్రాప‌ర్టీ ఎలా వ‌చ్చిందో కూడా చెక్ చేయ‌డం ఎంతో కీల‌కం. దానినే టైటిల్ డీడ్ అంటారు. ఒక‌వేళ ఆ య‌జ‌మాని వేరొక‌రి నుంచి ఆ ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన‌ట్లైతే.. అత‌ని వ‌ద్ద సేల్ డీడ్ అనేది ఉందో లేదో తెలుసుకోండి. ఆ య‌జ‌మానికి ప్రాప‌ర్టీ కానుక రూపంలో అందింది అనుకోండి.. గిఫ్ట్ డీడ్ అనేది ఉందా లేదా తెలుసుకోండి.

ఈ గిఫ్ట్ డీడ్‌లో కూడా రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి రిజిస్ట‌ర్డ్ ఇంకోటి అన్‌రిజిస్ట‌ర్డ్. ఒక‌వేళ ఆ య‌జమానికి ఫ‌లానా ప్రాప‌ర్టీ గిఫ్ట్‌గా వ‌చ్చింద‌నుకోండి.. ఆ గిఫ్ట్ ఇచ్చిన వారితో య‌జ‌మానికి స‌త్సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే స‌త్సంబంధాలు బాగున్న‌ప్పుడు ప్రాప‌ర్టీ గిఫ్ట్ ఇచ్చాక‌.. తీరా మ‌ధ్య‌లో గొడ‌వ‌లు వ‌చ్చి ప్రాపర్టీ గిఫ్ట్‌గా ఇచ్చిన వారి కుటుంబీకులు వ‌చ్చి ఇది మాది అన్నారంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.

ఇక ఈ టైటిల్ డీడ్ అంశంలో మ‌రో కీల‌కం అయిన విష‌యం ఏంటంటే.. క‌న్వేయ‌న్స్ డీడ్. అంటే మీరు కొనుగోలు చేయాల‌నుకుంటున్న ప్రాప‌ర్టీని య‌జ‌మాని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి కొనుగోలు చేసి ఉంటే ఈ క‌న్వేయ‌న్స్ డీడ్ ఉండి తీరాలి. ఇక నాలుగో కీల‌క అంశం ఏంటంటే.. మీరు ఎవ‌రి నుంచైతే ప్రాప‌ర్టీ కొనుగోలు చేయాల‌నుకుంటున్నారో వారు ఆ ప్రాప‌ర్టీకి జ‌న‌ర‌ల్ ప‌వ‌ర్ ఆఫ్ ఎటార్నీగా ఉన్నార‌నుకోండి ఆ ప్రాప‌ర్టీని కొనుగోలు చేయ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. ఎందుకంటే దీని వ‌ల్ల 90 శాతం స‌మ‌స్య‌లు వ‌స్తాయి.  (Property)

లింక్ డాక్యుమెంట్స్

ఒక ప్రాప‌ర్టీ ఎవ‌రెవ‌రి నుంచి చేతులు మారుతూ వచ్చిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌నే లింక్ డాక్యుమెంట్స్ అంటారు. సాధార‌ణంగా ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేవి 30 ఏళ్ల వ‌ర‌కు ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ య‌జ‌మానే ఇస్తాడు. ఒక‌వేళ మీరు ఎవ‌రి నుంచైతే ప్రాప‌ర్టీ కొనాల‌ని అనుకుంటున్నారో వారి వ‌ద్ద ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేవి లేక‌పోతే ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్లి కూడా చెక్ చేసుకోవ‌చ్చు. అస‌లు ఎక్క‌డా కూడా ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేవి దొర‌క‌క‌పోతే ఆ ప్రాప‌ర్టీని కొనక‌పోవ‌డం ఉత్త‌మం.

ఎన్‌కంబ్రెన్స్ స‌ర్టిఫికేట్

ఈ స‌ర్టిఫికేట్ ద్వారా మీరు ప్రాప‌ర్టీని అమ్మాల‌నుకుంటున్న ఓనర్ ఏవైనా లోన్స్ తీసుకున్నారా లేదా అనే అంశం తెలుస్తుంది. అయితే ఇక్క‌డ చిన్న రిస్క్ ఉంది. అదేంటంటే.. బ్యాంకుల నుంచి ఆ య‌జ‌మాని లోన్స్ తీసుకున్న‌ట్లైతే అవి ఈ ఎన్‌కంబ్రెన్స్ స‌ర్టిఫికేట్‌లో కనిపిస్తాయి. ఒక‌వేళ అత‌ను త‌న‌కు తెలిసిస వాళ్ల ద‌గ్గ‌ర త‌న‌ఖా పెట్టి ఉంటే మాత్రం ఆ వివ‌రాలు ఈ స‌ర్టిఫికేట్‌లో క‌నిపించ‌వు.

ట్యాక్స్ ర‌సీదులు

ఈ ట్యాక్స్ ర‌సీదులు కూడా తప్ప‌కుండా తీసుకోవాలి. అప్పుడే ఆ ప్రాప‌ర్టీ అమ్మాల‌నుకుంటున్న య‌జ‌మాని స‌రిగ్గా ట్యాక్సులు క‌డుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఒక‌వేళ ఈ ర‌సీదులు ఇవ్వ‌లేక‌పోతే అత‌ను ట్యాక్సులు ఎగ్గొడుతున్నాడ‌ని అర్థం. ఇది తెలిసీ అత‌ని నుంచి మీరు ప్రాప‌ర్టీ కొనుగోలు చేస్తే మాత్రం ఆ త‌ర్వాత ట్యాక్స్‌లు మీరు క‌ట్టుకోవాల్సి ఉంటుంది.

రెరా రిజిస్ట్రేష‌న్

మీరు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ప్రాప‌ర్టీ కొనుగోలు చేస్తున్నట్లైతే ముందుగా చెక్ చేయాల్సింది రెరా రిజిస్ట్రేష‌న్. మీరు కొనుగోలు చేయాల‌నుకున్న ప్రాప‌ర్టీ రెరాలో రిజిస్ట‌ర్ అయివుంటే ఆ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ న‌మ్మ‌ద‌గిన‌దే అనే న‌మ్మ‌కం మ‌న‌కు క‌లుగుతుంది. రెరాలో రిజిస్ట‌ర్ అవ్వ‌ని ప్రాప‌ర్టీల జోలికి మాత్రం పోక‌పోవ‌డ‌మే బెటర్.

బిల్డింగ్ రెగ్యుల‌రైజేష‌న్ స్కీం

ప్లాన్ ప్ర‌కారం ప్రాపర్టీని క‌ట్టారా లేదా అనేది ఈ స్కీం ద్వారా అర్థ‌మైపోతుంది. ఒక‌వేళ మీరు లోన్ తీసుకున్న ప్రాప‌ర్టీ కొనాల‌నుకుంటే ఈ బిల్డింగ్ రెగ్యుల‌రైజేష‌న్ స్కీం ప్ర‌కారం ఆ బిల్డింగ్ క‌ట్టడం లేక‌పోతే మీకు లోన్స్ ఇవ్వ‌రు. మ‌రో విష‌యం ఏంటంటే.. నాలుగు ఫ్లోర్లు క‌డ‌తామ‌ని చెప్పి.. ఐదు ఫ్లోర్లు వేసిన‌ట్లు అధికారుల‌కు తెలిస్తే దానిని మీరు కొన్న త‌ర్వాత కూడా కూల్చేసే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ కూల్చ‌క‌పోయినా డ‌బ్బులు క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తారు. కాబ‌ట్టి ఈ స్కీం స‌రిగ్గా ఉంటేనే ఆ ప్రాప‌ర్టీని కొనుగోలు చేయాలి.

మ్యుటేష‌న్ స‌ర్టిఫికేట్

ఈ మ్యుటేష‌న్ స‌ర్టిఫికేట్ అనేది మీకు ప్రాప‌ర్టీ రిజిస్ట్రేష‌న్ పేప‌ర్ల‌తో పాటు రావాలి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో మీకు ప్రాప‌ర్టీ అమ్మిన య‌జ‌మానికి త‌న త‌ల్లిదండ్రుల నుంచి ఆ ప్రాప‌ర్టీ వ‌చ్చిన‌ట్లైతే కొన్నిసార్లు ఓన‌ర్‌షిప్‌ను మార్పించుకోరు. అలాంటి స‌మ‌యంలో ప్రాప‌ర్టీ కొనుగోలు చేసేవారికి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అన్‌డివైడెడ్ షేర్

మీరు ఆల్రెడీ క‌ట్టేసిన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లైతే చెక్ చేయాల్సిన కీల‌క పాయింట్ అన్‌డివైడెడ్ షేర్. దీని ద్వారా మ‌న‌కు ఎంత షేర్ వ‌స్తుంది అనేది తెలుస్తుంది.

ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్

మీరు ఒక‌వేళ పాత ప్రాప‌ర్టీలు కొనుగోలు చేస్తున్న‌ట్లైతే ఈ ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌కుండా చెక్ చేసుకోవాలి.

అలాట్‌మెంట్ లెట‌ర్

జ‌ర‌గాల్సిన అలాట్మెంట్లు స‌రిగ్గా జ‌రిగాయా లేదా? స‌రిగ్గా అలాట్మెంట్లు జ‌రిగాకే మ‌న‌కు ప్రాప‌ర్టీ అమ్ముతున్నారా అనే విష‌యం ఈ లెట‌ర్ ద్వారా మ‌న‌కు తెలుస్తుంది.

పార్కింగ్ అలాట్మెంట్

మీరు ఒక‌వేళ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాల‌నుకుంటే దానికి పార్కింగ్ అలాట్మెంట్ ఎక్క‌డుంది అనేది కూడా ముందే తెలుసుకోవాలి.

క‌న్వ‌ర్ష‌న్ స‌ర్టిఫికేట్

ఒక‌వేళ ప్లాట్ కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ క‌న్వ‌ర్ష‌న్ స‌ర్టిఫికేట్ ఉందో లేదో త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అంటే.. రియ‌ల్ ఎస్టేట్ చేసేవారు రైతుల నుంచి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేసిన‌ప్పుడు వాటిని రెసిడెన్షియ‌ల్ ల్యాండ్స్‌గా క‌న్వ‌ర్ట్ చేయాల‌నుకుంటే ఈ క‌న్వ‌ర్ష‌న్ స‌ర్టిఫికేట్ అనేది చాలా కీలకం.

ప్రొహిబిటెడ్ ల్యాండ్స్

మీరు కొంటున్న ప్రాప‌ర్టీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అయితే మోస‌పోతారు. దేవ‌స్థానానికి సంబంధించిన భూముల‌, ప్ర‌భుత్వ భూములు ప్రొహిబిటెల్ ల్యాండ్స్ అంటారు. కొంద‌రు ఈ ల్యాండ్స్‌ని త‌మ ప్రాప‌ర్టీలుగా చూపించి అమ్మేయాల‌ని చూస్తుంటారు. మీరు కొనాల‌నుకుంటే ల్యాండ్ స‌ర్వే నెంబ‌ర్ ద్వారా అది ప్రొహిబిటెడ్ ల్యాండా కాదా అనేది తెలిసిపోతుంది.

ఇక్క‌డ మ‌రో కీల‌క విష‌యం గురించి మీరు తెలుసుకోవాలి. అదేంటంటే.. సైనికులకు ప్ర‌భుత్వం భూములు ఇస్తూ ఉంటుంది. వారి భూముల‌ను ప‌దేళ్ల వ‌ర‌కు ఎవ్వ‌రూ కొన‌కూడ‌దు. వారు అమ్మాల‌నుకున్నా కూడా సాధ్యం కాదు. ఒక‌వేళ మీరు కొనే భూమి సైనికుడి కుటుంబానికి చెందిన‌ది అయితే ప‌ది సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయో లేదో చూసుకోవాలి.

వెబ్ ల్యాండ్

ఒక‌వేళ మీరు ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేయాల‌నుకుంటే ఆ ల్యాండ్‌కు అడ్వాన్స్ క‌ట్టిన త‌ర్వాత స‌ర్వేయ‌ర్‌ను తీసుకెళ్లి ఆ ల్యాండ్‌లో మీ స‌రిహ‌ద్దులు ఎంత వ‌ర‌కు ఉన్నాయో చెక్ చేయించండి. కొన్నిసార్లు మీరు ల్యాండ్ అమ్మేవారు పేప‌ర్‌లో ఒక‌లాగ చూపిస్తుంటారు. తీరా వెళ్లి చూస్తే ఆ బోర్డ‌ర్ మీది కాదు అని మోస‌పోతారు.