మరోసారి సుప్రీంకు కవిత.. ప్రయత్నం ఫలించేనా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈడీ విచారణను తప్పించుకోవడానికి కవిత మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులు అందుకున్న కవిత ఈరోజే విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన తరపున ప్రతినిధిని పంపినట్లు సమాచారం. అంతేకాదు ఈరోజే (మార్చి 17) తాము దాఖలు చేసిన పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం (మార్చి 20 తేదీన) కవిత తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణకు పిటీషను దాఖలు చేయనున్నారు కవిత తరపు న్యాయవాదులు.
కాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫున న్యాయవాదులు వివరించారు. ఫోన్ సీజ్ వ్యవహారాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావించారు కవిత. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇవాల్టి విచారణ నుంచి కూడా మినహాయింపు కోరారు కవిత. అయితే ఈ కేసులో కవితకు చుక్కెదురైంది. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ కేసు విచారణను ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది.
కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ‘ఢిల్లీలోనే ఉన్న అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని, మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే’ అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. 20న విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.