Hari Hara Veeramallu: సంక్రాంతి బరిలో ..!

Hyderabad: ఈ ఏడాది ఆరంభం నుంచే పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఓకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన పవన్​ ఒక్కో సినిమా షూటింగ్​ ముగించే పనిలో పడ్డారు. క్రిష్​ జాగర్లముడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో పవన్​ నటిస్తున్న పీరియాడికల్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu). ఈ సినిమా కోసం పవన్​ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం కిందటే ప్రారంభమైనా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. భారీ బడ్జెట్​తో, అదిరిపోయే క్యాస్టింగ్‌తో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ముగించేందుకు పవన్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మరో 40 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, ప‌వ‌న్ కల్యాణ్ జూన్‌‌లో షూటింగ్​లో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించేయాలని దర్శకుడు క్రిష్ అండ్ టీమ్ చూస్తోందట.
అన్నీ పనులను ముగించుకుని, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే హరిహర వీరమల్లు సంక్రాంతి బరిలో కచ్చితంగా నిలుస్తుందంటున్నాయి చిత్రవర్గాలు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోండగా, వపన్ కల్యాణ్‌ను నెవర్ బిఫోర్ గెటప్‌లో చూడనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం.కీరవాణి(MM Keeravani) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మహేష్​ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్​(Trivikram) కాంబినేషన్లో రూపొందుతున్న SSMB28 సంక్రాంతి బరిలో నిలబడనున్నట్లు ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 13, 2024న రిలీజ్​ కానుంది.