GIS 2017: నాడు జగన్ చేసిన పని ఇదీ!
రాజకీయాలు అటుంచితే.. రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే చాలు అనుకునే నాయకులు కొందరు ఉంటారు. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు.. తమ అధికారంలోనే మంచి జరగాలని కోరుకునేవాళ్లు మరికొందరు ఉంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అనుకుంటున్నారా? అయితే 2017లో ఏం జరిగిందో మీకు తెలియాలి. ఈరోజు, రేపు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎందరో వ్యాపారవేత్తలు వచ్చి ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ రెండు రోజులు ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోమని, అధికారంలో ఉన్నది ఎవరైనా రాష్ట్రానికి మంచి జరిగితే చాలు అని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసారు.
అయితే ఇప్పుడు 2017కు సంబంధించిన ఏపీ సీఎం జగన్ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులవి. ఆ సమయంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ వైజాగ్‌లోనే జరిగింది. అయితే ఈ సదస్సును జరగనివ్వకుండా..జగన్ తన సహచరులతో కలిసి ధర్నా చేపట్టారు.వైజాగ్‌లో ధర్నాలు చేపట్టి సదస్సును అడ్డుకోవడానికి యత్నించి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలని అనుకున్నారట. దాంతో పోలీసులు వారిని సిటీలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో జగన్ ఎయిర్‌పోర్ట్‌లోనే బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆ సమయంలో తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే పెట్టుబడుల సదస్సు టీడీపీ హాయాం లో జరుగుతుంటే ఇదే వైసీపీ వాళ్ళు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు ల పేరుతో ధర్నాలు చేసేవాళ్ళని, టీడీపీ కి వైసీపీ కి ఉన్న తేడా అదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సుకి బీజేపీ, జనసేన మద్దతు మాత్రమే ఉందని, జగన్ హయాంలో ఇలాంటి సదస్సు జరగడం టీడీపీకి ఏమాత్రం ఇష్టంలేదని మరికొందరి వాదన. ఏదైతేనేం.. మొత్తానికి ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో నేడు, రేపు జరగనున్న ఈ సదస్సులో ఎందరో వ్యాపారవేత్తలు లక్షల కోట్లల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఏపీ యువతకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.