Zerodha: ఎవ్వరినీ ఉద్యోగం నుంచి తీసేయను
Hyderabad: AIలు ఎన్ని వచ్చినా తన వద్ద పనిచేస్తున్నవారిని ఉద్యోగం నుంచి తీసేయనని అన్నారు జెరోదా(zerodha) సంస్థ అధినేత నితిన్ కామత్(nithin kamath). ఏఐ వల్ల మున్ముందు మరిన్ని లేఆఫ్‌లు అవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో నితిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రశంసనీయంగా మారింది. ఈ ఏఐ టెక్నాలజీని తాము కూడా ఇంటర్నల్‌గా రూపొందించుకున్నామని కాకపోతే తమ కంపెనీ అవసరాలకు మాత్రమే దానిని వాడుతున్నామని తెలిపారు.
“కొన్నేళ్ల క్రితం ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయ్ అని అన్నప్పుడు నేను లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే అనిపిస్తోంది. అందుకే మా కంపెనీలో ఇంటర్నల్‌గా ఏఐ టెక్నాలజీని రూపొందించుకున్నాం. ఇది మా ఉద్యోగుల భయాలను తొలగించడానికి మాత్రమే. ఏఐ వల్ల నేను ఉద్యోగుల్ని తొలగించలేను. ఇప్పుడున్న కంపెనీలు ఏఐ పేరు చెప్పి ఉద్యోగాల నుంచి తీసేస్తాయ్. దాని వల్ల షేర్ హోల్డర్లు లాభపడతారేమో కానీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. అది మానవత్వానికే చేటు. ఇంకొన్ని ఏళ్లలో ఏఐ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిసిపోతుంది. వ్యాపారాలు ప్రారంభించినప్పుడు ఉద్యోగులే ఆ వ్యాపారాన్ని బలోపేతం చేసారని కంపెనీలు మర్చిపోకూడదు. ఓ సీఈఓ అయివుండి నేను ఇలా మాట్లాడటం వింతగానే ఉంటుందనుకోండి” అని ట్వీట్ చేసారు నితిన్.