Atiq ahmed: 15 రోజుల్లో ఏసేస్తాం.. హత్యకు ముందు పోలీసుల బెదిరింపు
Lucknow: ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, పొలిటిషియన్ అతీక్ అహ్మద్(atiq ahmed), అష్రఫ్‌ల(ashraf) హత్య కేసులో షాకింగ్ విషయం ఒకటి బయటికొచ్చింది. వారి హత్యకు 15 రోజుల ముందు ఓ పోలీస్ అధికారి.. “మొన్న తప్పించుకున్నారు..15 రోజుల్లో మిమ్మల్ని ఏసేస్తాం” అని బెదిరించారట. ఈ విషయాన్ని అష్రఫ్.. హత్యకు ముందు తనకు చెప్పినట్లు లాయర్ విజయ్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే అలా బెదిరించిన పోలీస్ అధికారి పేరు మాత్రం తనకు చెప్పలేదని అన్నారు. హత్య జరిగిన మరుసటి రోజు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్‌కు, ప్రయాగ్‌రాజ్ జస్టీస్‌కు ఓ లెటర్ వస్తుందని అందులో బెదిరించిన అధికారి పేరు ఉంటుందని అష్రఫ్ తనతో చెప్పినట్లు విజయ్ తెలిపారు. అంతేకాదు.. తనపై తప్పుడు కేసులు పెట్టారన్న విషయం ఆదిత్యనాథ్‌కు కూడా తెలుసని, తన బాధను ఆదిత్య అర్థం చేసుకున్నారని అష్రఫ్ విజయ్‌తో అన్నాడట. ఈ విషయాన్ని ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు చెప్తున్నారన్నది అసలు ప్రశ్న. అతీక్, అష్రఫ్‌లకు ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు హత్యకు ముందే ఎందుకు మీడియాకు చెప్పలేదని అంటున్నారు. ఈ విషయంపై ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏమంటుందో వేచి చూడాలి.