Summer: బాబోయ్‌.. ఇదేం సెగ.. ఇవేం ఎండలు..!

Hyderabad: ఎండల తీవ్రత(summer) రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. APలో అయితే.. ఉదయం 8గంటలకే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే.. ప్రజలు హడలిపోతున్నారు. ఇక మధ్యాహ్నానికి గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. దీంతో ఇంట్లో నుంచి అడుగు తీసి.. అడుగు బయట పెట్టాలంటే.. ప్రజలు హడలిపోతున్నారు. వైద్యులు, వాతావరణ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. ఎండలతోపాటు, వడగాలులు వీస్తున్నందున అత్యవసరమైతే తప్ప.. ఎవరూ బయటకు రావదని సూచిస్తున్నారు. మరోవైపు జూన్‌ తొలి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి మే నెల చివరి నాటికి రుతుపవనాలు రావాల్సి ఉందగా… ఈ ఏడాది మరింత ఆలస్యం కానున్నాయి. దీంతో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో ఇవాళ ఇలా..
ఏపీలో దాదాపు 20 మండలాల్లో తీవ్రమైన వడగాలులు ఉంటాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందన్నారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో సరాసరి 42 డిగ్రీలు నమోదు కానుంది.

తెలంగాణలో ‘హీట్‌ వేవ్‌ అలర్ట్‌’ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. నిన్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటగా, ఏడుచోట్ల 44 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. 23 చోట్ల 43 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. 18 చోట్ల 42 డిగ్రీలకు పైగా నమోదయ్యిందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.