డిగ్రీలు ప‌నికిరావు.. ఉద్యోగాలు రావు..!

Hyderabad: ఒక‌ప్పుడు ఇంజినీరింగ్, డిగ్రీ(degrees)లకు ఎంతో విలువ ఉండేది. ప‌దో త‌ర‌గ‌తి అయిపోగానే ఎంపీసీలో వేసేయ‌డం, ఎంసెట్ రాయించేయ‌డం, ఇంజినీరింగ్‌లో చేర్పించేయ‌డం(unemployment). ఇదే ఫార్ములాను పాటించేవారు పేరెంట్స్. అస‌లు విద్యార్థుల‌కు ఏం చ‌ద‌వాల‌ని ఉందో కూడా తెలుసుకోలేక‌పోతున్నారు. చెప్పాలంటే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అస‌లు ఏం చ‌ద‌వాలో విద్యార్థుల‌కు అంతుప‌ట్ట‌డంలేదు. వీమ్‌బాక్స్ అనే టాలెంట్ ఎక్విసిజ‌న్‌ సంస్థ చేసిన స‌ర్వే ప్ర‌కారం ఇప్పుడున్న డిగ్రీలు ప‌నికిరావ‌ని, మున్ముందు నిరుద్యోగ సంక్షోభం త‌ప్ప‌ద‌ట‌.

ఇందుకు కార‌ణం విద్యా వ్య‌వ‌స్థ‌లో మిక్స్‌డ్ క్వాలిటీ ఉండ‌ట‌మే. ఒక డిగ్రీ కోర్సు కాకుండా వివిధ కోర్సులు చేసిన వారే ఇంట‌ర్వ్యూల‌కు వ‌స్తున్నార‌ని దాంతో ఉద్యోగుల‌ను ఎలా ఎంపిక‌చేసుకోవాలో తెలీడంలేద‌ని కంపెనీలు అంటున్నాయి. ప్ర‌స్తుతం దేశంలోని విద్యావ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల కార‌ణంగా మున్ముందు యువ‌త‌కు గ‌డ్డు కాల‌మేన‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మా ఇన్‌స్టిట్యూట్‌లో చేరండి జాబ్ ప‌ట్టండి అని కొన్ని సంస్థ‌లు యువ‌త‌ను ఊరిస్తున్నాయి. అత్య‌ధిక ఫీజులు వ‌సూలు చేసి పిండేస్తున్నాయి.

భారతదేశ విద్యా పరిశ్రమ 2020లో 117 బిలియన్ డాల‌ర్లు ఉంది. ఇది 2025 నాటికి 225 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంటుందని అంచనా. ఇలా కేవ‌లం డ‌బ్బులు పెంచుకుంటూపోవ‌డ‌మే త‌ప్ప విద్యార్థుల‌కు నేర్పించే పాఠాల్లో నాణ్య‌త ఉండటం లేదు. కోర్సులో ముఖ్య‌మైన స్కిల్స్ వ‌దిలేసి పై పైన నేర్పించి సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. దీని ద్వారా టాప్ స్కోర్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఇంట‌ర్వ్యూల్లో స‌మాధానాలు చెప్ప‌లేక‌పోతున్నారు. ఇది ఇలాగే కొన‌సాగితే మున్ముందు త‌రాల‌కు కేవ‌లం చేతిలో ప‌నికిరాని డిగ్రీ ప‌ట్టా ఉంటుందే త‌ప్ప చేయ‌డానికి సరైన ఉద్యోగం మాత్రం ఉండ‌దు అని విద్యా నిపుణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.