చరణ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ – ‘మగధీర’ రీరిలీజ్ డేట్ ఫిక్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రెండో సినిమాకే రాజమౌళి వంటి దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో చరణ్ లవర్ బాయ్‌గానే కాకుండా తనలో మంచి నటుడు ఉన్నాడని కూడా నిరూపించేసుకున్నాడు. మగధీర సినిమా తర్వాత నుంచే చిరు తనయుడిగా కాకుండా తనకంటూ ప్రత్యేక స్టార్డం సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను రిరిలీజ్ చేయడానికి ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ ప్రకటించింది. `మగధీర` రీ రిలీజ్ చేయబోతున్నారని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ నడుస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎవరూ మాట్లాడలేదు. ఇక ఈసినిమా పై మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
13 ఏళ్ల క్రితమే కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ తో.. `మగధీర` సినిమాను నిర్మించి సాహసం చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. అంత బడ్జెట్‌తో సినిమా నిర్మించేముందు నిర్మాతలు ఎన్నో ఆలోచించుకుంటారు. కానీ రాజమౌళి సినిమాల రికార్డు, అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయిన రామ్ చరణ్, తన అందచందాలతో అలరిస్తున్న కాజల్ అగర్వాల్‌ల కాంబినేషన్ కావడంతో సినిమా ఆడుతుందని నిర్మాత అల్లు అరవింద్ గట్టిగా నమ్మారు. అందుకే జక్కన్న చెప్పినట్లుగా నిర్మాణ విషయంలో ఎక్కడా లోటు కనబడనీయకుండా అనుకున్నట్లుగానే తెరకెక్కించారు. అలా మగధీర సినిమా అప్పట్లోనే పాన్ఇండియా సినిమాలకు ధీటుగా అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది.
అనుకున్నదానికంటే మూడింతలు ఎక్కువే వసూళ్లు రాబట్టడంతో ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలకు మంచి కథ జోడిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అన్న నమ్మకాన్ని ఇతర దర్శకుల్లో నింపింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్ అంతా పుష్కలంగా ఉన్న సినిమా `మగధీర`. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని కాలభైరవ గా రామ్ చరణ్ , మిత్రవిందగా కాజల్ పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేరు. ఈ సినిమా మళ్లీ రిలీజ్ అవుతుండడంతో.. అభిమానులు మరోసారి థియేటర్లలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.