Dhoni: ఇదే నా లాస్ట్.. ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?

Hyderabad: చెన్నై సూప‌ర్ కింగ్స్(chennai super kings) కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ(dhoni).. ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవ్వ‌నున్నాడా? నిన్న ఆయ‌న మీడియాతో మాట్లాడిన మాట‌లు వింటుంటే అదే నిజం అనిపిస్తోంది. నిన్న చెన్నై సూప‌ర్ కింగ్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై గెలిచింది. అది కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో. ఈ సంద‌ర్భంగా ధోనీ మాట్లాడుతూ.. “ఏం చెప్పినా, ఏం చేసినా.. నా కెరీర్‌లో ఇదే లాస్ట్ ఫేజ్‌. కాబ‌ట్టి ఆడుతున్నంత సేపు ఎంజాయ్ చేస్తుండాలి. 2019 త‌ర్వాత చెపాక్ స్టేడియంలో ఆడాం. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు బ్యాటింగ్ చేయ‌డానికి ఎక్కువ అవకాశాలు రావ‌డంలేదు. అయినా ఫ‌ర్వాలేదు. నా టీం చాలా బాగా ఆడుతోంది” అని తెలిపారు.

దాంతో ధోనీ మాట‌లకు ఫ్యాన్స్ ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ.. ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేస్తున్నారా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. 2022 ఐపీఎల స‌మ‌యంలో ధోనీ.. త‌న కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను ర‌వీంద్ర జ‌డేజాకు అప్ప‌గించారు. అప్ప‌టికే ధోనీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవ్వాల‌నుకుంటున్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ వరుస ప‌రాజ‌యాల కార‌ణంగా జ‌డేజా కెప్టెన్సీని మ‌ళ్లీ ధోనీకే అప్ప‌గించేసాడు. 2019 ఐపీఎల్ స‌మ‌యంలో చెపాక్ స్టేడియంలో ఆడియ‌న చెన్నై సూప‌ర్ కింగ్స్.. మ‌ళ్లీ నిన్న జ‌రిగిన మ్యాచ్ అక్క‌డే ఆడ‌టం.. స‌న్‌రైజ‌ర్స్‌పై గెల‌వ‌డంతో స్టేడియం ద‌ద్ద‌రిల్లిపోయింది. ఏదేమైన‌ప్ప‌టికీ ధోనీ అలా లాస్ట్ ఫేజ్ అని ఎందుకు అన్నారో ఆయ‌నే స్ప‌ష్ట‌త‌నిస్తే బాగుంటుంది.