population: మనమే టాప్.. చైనాను దాటేసాం!
Delhi: చైనా జనాభాను భారతదేశం(india) అధిగమించేసింది. దీంతో ప్రపంచలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. తాజాగా.. ఐక్యరాజ్య సమితి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్(UNFPA) – 2023 పేరుతో జనాభా లెక్కలకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశ జనాభానే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. చైనా (China) జనాభా 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి 1950 నుంచి వివిధ దేశాల జనాభా సమాచారాన్ని సేకరిస్తోంది. అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో భారత దేశం నిలవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మధ్యలోనే 29 లక్షల జనాభాతో భారత్ చైనాను అధిగమించినట్లు తెలిపింది. అయితే, గతంలో ఎన్నడూ భారత్ చైనా జనాభాను అధిగమించలేదు. జనాభా పరంగా భారత్, చైనా దేశాల తర్వాత 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడో స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
వాస్తవానికి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లేక్కలను సేకరించాల్సి ఉంది. అయితే.. 2011లో జనాభా లెక్కల సేకరణ చేపట్టలేదు. ఆ తర్వాతి షెడ్యూలు ప్రకారం 2021లో సేకరణ జరగాల్సి ఉన్నా.. కొవిడ్ మహమ్మారి వల్ల అది సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి(united nations organization) చెబుతున్న లెక్కలు కచ్చితమైనవని వందశాతం చెప్పలేకపోయినా.. చైనా జనాభాను దాటిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే.. కరోనా వంటి విపత్తుల వల్ల అనేక మంది చైనా ప్రజలు చనిపోయారు. దీంతోపాటు జనాభా నియంత్రణకు అక్కడి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. దీంతో చైనా జనాభా గణనీయంగా తగ్గి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.