హైట్ పెరగడానికి కోటి రూపాయలతో సర్జరీలు..!
America: పొడవు పెరగాలని ఓ వ్యక్తి సర్జరీలు చేయించుకున్నాడు. ఆ సర్జరీల విలువ ఏకంగా కోటిన్నర రూపాయలు. అమెరికాలో(america)ని మిన్నెసోటాకు(minnesota) చెందిన మోసెజ్ జిబ్సన్ అనే 41 ఏళ్ల వ్యక్తి 5 అడుగులు 5 అంగుళాలతో పుట్టాడు. దాంతో కాలేజీ సమయం నుంచి తన హైట్ చూసుకుని బాధపడుతూ ఉండేవాడు. తన హైట్‌ని చూసి అమ్మాయిలు కూడా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదట. దాంతో పొడవుగా కనిపించడానికి బూట్లలో వస్తువులు పెట్టుకునేవాడు. వాటన్నిటినీ ట్రై చేసి విసిగిపోయిన జిబ్సన్.. ఎలాగైనా పొడవు పెరగాలని నిర్ణయించుకున్నాడు.
అందుకు కావాల్సిన మందులు కూడా ఎన్నో వాడాడు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో రిస్క్ చేసి మరీ కాళ్ల పొడవు పెంచుకునే సర్జరీలు చేయించుకోవాలనుకున్నాడు. అక్కడ ఇలాంటి సర్జరీలు చాలా ఖరీదు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే పార్ట్ టైంలో ఉబర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అలా 75,000 డాలర్లు సేవ్ చేయగలిగాడు. అలా 2016లో మొదటి సర్జరీ చేయించుకున్నాడు. రిజల్ట్స్‌తో తాను హ్యాపీగానే ఉన్నానని జిబ్సన్ అంటున్నాడు.
మొన్న మార్చిలో రెండో సర్జరీ చేయించుకున్నాడు. దీనికి అతనికి అయిన ఖర్చు 98,000 వేల డాలర్లు. ఇప్పుడు రెండు సర్జరీలు అయ్యాయి కాబట్టి కాస్త కోలుకున్నాక హైట్ చూసుకోవాలని అంటున్నాడు. ఇంత ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్నాడు కాబట్టి కనీసం తన హైట్ ఇప్పుడు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాడు. అంతేకాదు.. ఇప్పుడు అతనికి ఓ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందట. అంత డబ్బు ఖర్చు చేసి అంత నొప్పిని భరించినప్పటికీ తనకు ఎలాంటి బాధ లేదని చెప్తున్నాడు జిబ్సన్.