హ్యాకైన‌ తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వెబ్​సైట్

స్మార్ట్​యుగంలో సైబర్​ క్రైం రేటు రోజురోజుకీ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వ్యక్తులు, ప్రైవేటు వ్యాపార సంస్థలు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ సంస్థ ఈ క్రైం బారిన పడింది. ప్రతిష్టాత్మక సంస్థ అయిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్ పీఎస్సీ) వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆది, బుధ, గురువారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఆదివారం టౌన్‌ ప్లానింగ్‌ బిల్దింగ్‌ ఓవర్‌సీర్‌ (టీపీబీవో) పోస్టులకు, 15, 16న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని టీఎస్ పీ ఎస్ సీ పేర్కొంది. వెబ్‌సైట్‌ హ్యాక్‌ కావడంపై టీఎస్ పీఎస్సీ సూపరింటెండెంట్‌ బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, టీపీబీవో, వీఏఎస్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిర్దిష్ట వివరాలు తెలపనప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశమే అయి ఉంటుందని తెలిసింది. హ్యాకర్లు టెక్నాలజీని ఉపయోగించి ప్రశ్నపత్రాలను కూడా సంపాదించి ఉండొచ్చని భావిస్తున్నారు. హ్యాకింగ్‌ ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. టీపీబీవో పరీక్షకు ఒక రోజు ముందు గుర్తించిన అధికారులు బేగంబజార్‌ పీఎస్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్‌ అంశాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అందుకు భిన్నంగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సైబర్‌ పోలీసులకు బదిలీ చేయనున్నారు. ‘టీఎస్ పీఎస్సీ అధికారులు హ్యాకింగ్‌ జరిగినట్లు మాత్రమే ఫిర్యాదు ఇచ్చారు. అందులో ఎలాంటి పూర్తి సమాచారం లేదు. ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు ఇప్పుడే చెప్పలేం. విచారణలో అన్ని వివరాలు తేలతాయి’ అని పోలీసు అధికారులు చెబుతున్నారు. వెబ్ సైట్ హ్యాక్ అయిన నేపథ్యంలో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అభ్యర్థులు.