ఉద్దేశపూర్వకంగానే ప్రీతీపై వేధింపులు.. సూసైడ్‌కి ముందు జరిగింది ఇదే

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమెకు హైదరాబాద్‌ నిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయిదు విభాగాలకు చెందిన వైద్యుల బృందం నిరంతరం ప్రీతి వద్దే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. వెంటిలేటర్‌ సపోర్ట్‌తోపాటు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ఈక్రమంలో ప్రీతిని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై గురువారం నిమ్స్‌కు వచ్చారు. అక్కడ అందిస్తున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చారు. ఇక మరోవైపు ప్రీతి ఆత్మహ్యయత్నానికి కారకుడైన ఆమె సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వరంగల్‌ సీపీ రంగనాథ్‌ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను వెల్లడించారు.

ప్రీతీనే లక్ష్యంగా చేసుకుని సైఫ్‌ వేధించాడు..
వైద్య విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సైఫ్‌ వేధింపులకు పాల్పడినట్లు సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ఇద్దరూ అనిస్థీషియా విభాగానికి చెందిన వారు కావడంతో సీనియర్లు, జూనియర్లు కలిపి వాట్సప్‌ గ్రూప్‌ ఉందని అందులో ప్రీతీని లక్ష్యంగా చేసుకుని సైఫ్‌ ఉద్దేశపూర్వకంగా వేధించాడని సీపీ వివరించారు. సంబంధిత వాట్సప్‌ చాట్‌లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. అందరి ముందు ప్రీతీని తక్కువగా చేసి మాట్లాడటంతో ఆమె మనోవేదనకు గురైందని అన్నారు. అప్పుడే అతని పర్సనల్‌ నంబర్‌కు కూడా ప్రీతి మెసేజ్‌ చేసి ఏమైనా ఉంటే నేరుగా తనకే తెలిసేలా చెప్పమని సైఫ్‌ను కోరినట్లు చెప్పారు. అయినా సైఫ్‌ అవేమీ పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

 

నీకు బుర్ర లేదు’ అని అవమానిస్తూ..అందరూ ఉండే వాట్సప్‌ గ్రూప్‌లలో ప్రీతి తప్పులను ఎత్తి చూపిస్తూ.. నీకు బుర్రలేదు, అలా చేస్తున్నావ్‌, ఇలా చేస్తున్నావ్‌ అంటూ సైఫ్‌ మెసేజులు పెట్టేవాడని సీపీ రంగనాథ్‌ తెలిపారు. దీనికి బదులుగా ప్రీతి కూడా స్పందించి ‘నీ పని నువ్వు చూసుకో’ ఏదైనా ఉంటో హెచ్‌వోడీకి చెప్పు అంటూ సైఫ్‌ నంబర్‌కు మెసేజ్‌ చేసిందని చెప్పారు. దీంతో మరింత రెచ్చిపోయిన సైఫ్‌ అవకాశం దొరికినప్పుడల్లా ప్రీతిని ఇబ్బందులు పెడుతూ వచ్చాడని తెలిపారు. తోటి మిత్రులతో కూడా ఆమె తన మాట వినడం లేదని మీరెవరూ సహకరించవద్దని వారిని కోరినట్లు విచారణలో తేలిందన్నారు. వాస్తవానికి ప్రీతి చాలా ధైర్యం ఉన్న అమ్మాయని, ప్రశ్నించే తత్వం ఉన్న యువతి అని సీపీ అన్నారు. కానీ కొంత సున్నితమైన మనస్తత్వం ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామన్నారు. ప్రీతి తెలివైన విద్యార్థిని, గతంలో కూడా సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్య్వూలకు కూడా వెళ్లినట్లు సీపీ తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు ఇదే జరిగింది..
ప్రీతి ఆత్మహత్య చేసుకునేముందు గూగుల్‌లో పలు రకాల మత్తు ఇంజెక్షన్ల గురించి సెర్చి చేసినట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు. అయితే వాటిని వినియోగించినట్లు స్పష్టత ఇవ్వలేమన్నారు. ఇప్పటికే ఆమె రక్త నమూనాలను ల్యాబ్‌లకు పంపామని అవి వచ్చిన వెంటనే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. ప్రీతి వద్ద ఉన్న కొన్ని ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 20న సైఫ్‌ వేధింపుల విషయమై ప్రీతి తన తండ్రికి చెప్పిందని.. ఆయన వెంటనే వరంగల్‌ ఏసీపీని సంప్రదించిన మాట వాస్తవమేనని సీపీ తెలిపారు. అయితే ఇతర పనుల్లో ఉండటం వల్ల ఏసీపీ వెంటనే స్పందించలేదన్నారు. వేధింపుల విషయాన్ని ప్రీతి తండ్రి మరో ఎస్సైకి తెలిపారన్నారు. ఆయన వెంటనే కళశాల ప్రిన్సిపల్‌కు విషయాన్ని తెలియజేయగా ఆ తర్వాత రోజు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చారన్నారు. ఆ సమయంలో సైఫ్‌ తాను జూనియర్లు చేసే తప్పులను సరిదిద్దాలని చూస్తున్నానే తప్పా వేరే దురుద్దేశం లేదని ప్రిన్సిపల్‌కి తెలిపాడు. కానీ అవన్నీ అవాస్తవమని సీపీ వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రీతీని వేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సైఫ్‌ను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన అన్నారు.