kcr సర్కార్ గుడ్ న్యూస్.. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఏసీ హెల్మెట్‌లు!
hyderabad: ట్రాఫిక్ విధులు నిర్వహించడం అంటే…. కానిస్టేబుళ్లకు ఎంతో కష్టంతో కూడుకున్నది. అదీ కూడా ఎండలో చేయాలంటే మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు ట్రాఫిక్‌కు క్రమబద్దీకరిస్తూనే.. మరోవైపు ఎండల వేడిమిని తట్టుకుని విధులు నిర్వర్తించాలి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్(telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పోలీసులకు కూలింగ్ గ్లాసులు అందజేయగా.. ఇప్పుడు ఎండలు తీవ్రతరంగా మారుతున్న నేపథ్యంలో ఏసీ హెల్మెట్లను అందించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్(rachakonda cp ds chauhan) ఆధ్వర్యంలో ఎల్బీనగర్(lb nagar)లోని తన క్యాంపు కార్యాలయంలో గత వారం కిందట కొంతమంది ట్రాఫిక్ పోలీసుల(traffic conistable)కు ఏసీ హెల్మెట్ల(Ac helmets)ను అందజేశారు. ప్రయోగాత్మకంగా అందించి.. వాటి పనితీరును ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఏసీ హెల్మెట్ ఛార్జింగ్ ఆధారంగా పనిచేస్తుంది. అరగంట ఛార్జింగ్ పెడితే.. మూడు గంటల పాటు పనిచేస్తుంది. బ్యాటరీ ఆధారంగా ఈ ఏసీ హెల్మెట్ పనిచేసేలా అభివృద్ధి చేశారు. అంతేకాదు.. హెల్మెట్‌కు మూడు వైపుల నుంచి గాలి వచ్చేలా తయారు చేశారు. ఇది ధరించిన వారి ఫేస్‌కి, హెల్మెట్ లోపల.. మూడు వైపుల నుంచి చల్లని గాలి వీస్తుంది. ఎండ నుంచి రక్షణ కోసం ఏసీ హెల్మెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని సీపీ చౌహన్ చెబుతున్నారు. హెల్మెట్‌ల పనితీరు బాగుంటే.. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ సర్కార్ అందించేందుకు సిద్దమయ్యింది.
నిత్యం ఎండలో ఉండే.. ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేలా.. చల్లని గాలిని ఏసీ హెల్మెట్‌లు అందిస్తాయని అంటున్నారు. దీని వల్ల చల్లని వాతావరణంలో పనిచేసుకోవచ్చని అంటున్నారు. వడదెబ్బ, ఎండ వేడి నుంచి ట్రాఫిక్ కానిస్టేబుళ్లను ఈ ఏసీ హెల్మెట్ రక్షిస్తుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని అందించాలని పోలీస్ శాఖ ఇటీవల నిర్ణయించింది. త్వరలోనే అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.