కర్నాటక ఎన్నికలు- BJP అభ్యర్థుల తొలి జాబితా సిద్దం

కర్నాటక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ రెండు విడతలుగా బరిలో నిలిచే 142 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 93 సీట్లకు అభ్యర్థుల పేర్లను జేడీఎస్ ప్రకటించింది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ కూడా ఓ వ్యూహం ప్రకారమే అభ్యర్థుల ఎంపికను ఆలస్యం చేస్తూ వస్తోంది. ఇతర పార్టీల్లో చోటు దక్కని అభ్యర్థులను తమవైపు తిప్పుకోవచ్చని భావించిన ఆ పార్టీ దాదాపు మూడు రోజుల నుంచి ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇక ఈ సుదీర్ఘ కసరత్తు తర్వాత బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఇవాళ ఓ క్లారిటీ రానుంది. సుమారు 170 నుంచి 180 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సిద్ధం చేశారని.. సోమవారం సాయంత్రం ఈ జాబితా విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఢిల్లీలో తెలిపారు.

బీజేపీ అధిష్ఠానం నుంచే ఎంపికలు..
కర్నాటక ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న అధికార బీజేపీ… ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను ఎట్టకేలకు సిద్దం చేసింది. దీనికోసం దాదాపు కర్నాటకు చెందిన బీజేపీ నేతలు మూడు రోజులుగా ఆ పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, ఇతర పెద్దలతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. ఇక ఇందులోనూ ప్రత్యేక వ్యూహం ఉందంటూ.. ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లిస్టుపై నిన్న అనగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిస్టర్‌అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ సహా భారతీయ జనతా పార్టీ సీఈసీ సభ్యులు సమావేశమై అభ్యర్థుల జాబితాపై సమాలోచన చేశారు. ఈ మీటింగ్‌లో కర్ణాటక సీఎం బొమ్మై, సీనియర్ నాయకులు బీఎస్ యడియూరప్ప, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం పాల్గొన్నారు. వీరితోపాటు కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జి అరుణ్ సింగ్, కో-ఆర్డినేటర్ డీకే అరుణ, ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఎలక్షన్ కో-ఇన్‌చార్జి మన్షుక్ మాండవీయ హాజరయ్యారు. అంతకుముందు బసవరాజ్ బొమ్మై, యడియూరప్ప, కటీల్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుని జేపీ నడ్డా నివాసంలో జాబితా ఖరారుపై చర్చలు సాగించారు. ఈ సమావేశంలో అమిత్‌షా, ఇతర కేంద్ర నాయుకులు సైతం పాల్గొనడం విశేషం. శనివారం నాడు సీటీ రవి, గోవింద్ కర్జోల్ సైతం ఢిల్లీ చేరుకుని సమావేశాలకు హాజరయ్యారు. తుది సమావేశం నడ్డా నివాసంలో ఆదివారం జరిగింది. జాబితాకు తుదిరూపం ఇచ్చారు. సీఈసీ ఆమోదం కోసం సోమవారం మరోమారు సమావేశమై జాబితాను ప్రకటించనున్నట్లు యడియూరప్ప చెబుతున్నారు. మరోవైపు గెలుపు ఆధారంగానే అభ్యర్థుల ఎంపికకు జేపీ నడ్డా ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా రాష్ట్ర నాయకులు కృషి చేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. తొలి జాబితాలో బసవరాజ్ బొమ్మై, బీఎస్ విజయేంద్ర, సీటీ రవి రమేష్ జార్కిహోలి, తదుతరుల పేర్లు ఉన్నట్లు సమాచారం.