నేటి నుంచే జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలు
దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీని కోసం ఇప్పటికే అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్దం చేశారు. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా సుమారు 9.40 లక్షల మంది హాజరుకానుండగా… సీట్ల సంఖ్య మాత్రం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఉన్నాయి. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది తుది విడత పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలను విడతల వారీగా జరపనున్నారు. ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలో మొత్తం 330 నగరాలు, పట్టణాలతోపాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడా పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి, తుది విడతలో వచ్చిన స్కోర్‌లో అధిక మార్కులను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. సామాజిక వర్గాల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు ఎంపిక చేయనున్నారు. ఇవన్నీ ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు.