వరంగల్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య!
వరంగల్‌కి చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటనను మరవక ముందే ర్యాగింగ్ భూతానికి మరో యువతి బలయింది. భూపాలపల్లికి చెందిన రక్షిత అనే 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రక్షిత ఓ సీనియర్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురయింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం వరంగల్‌లోని రామన్నపేటలోని తమ బంధువుల ఇంట్లో రక్షిత ఉరివేసుకొని మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రీతి లాగే తమ కూతురు కూడా సీనియర్ల వేధింపులకు బలయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమా దేవి కూతురు పబ్బోజు రక్షిత (20) వరంగల్ నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. హనుమకొండ కిషన్ పురాలోని ఓ హాస్టల్లో ఉంటూ కాలేజ్ బస్‌లో నిత్యం కాలేజీ వెళ్లి వస్తుండేది. రక్షిత తండ్రి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భూపాలపల్లికి చెందిన పరిచయమున్న యువకుడు ప్రేమ పేరుతో వేధింపులు, సెల్ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో రక్షిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం వరంగల్ రామన్నపేటలోని బంధువులకి తల్లితో రక్షిత వచ్చింది. ఆదివారం సాయంత్రం బాత్ రూంలో వెళ్లి.. బయటకు రాకపోగా అనుమానించి ఇంట్లోని వారు లోపలికి వెళ్లి చూడగా.. ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది.
కొంత కాలంగా రక్షితను యువకుడు వేధిస్తుండడంతో ఈనెల 22న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుకూడా నమో దైంది. కేసు నమోదైన రెండురోజుల తర్వాత రక్షిత భూ పాలపల్లిలోని ఇంటికి చేరింది. భూపాలపల్లికి చెందిన యువకుడిపై ఫిర్యాదు చేసినట్టు మట్టెవాడ పోలీసులు తెలిపారు.