Jai Simha: మహిళా క్రికెట్ హెడ్ కోచ్ సస్పెండ్.. అసలేం జరిగింది?
Jai Simha: మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ ఆరోపణలపై కోచ్ జై సింహా కూడా స్పందించారు. తానూ ఏ తప్పూ చేయలేదంటూ చెప్పుకొచ్చారు.
మహిళా క్రికెటర్ల పట్ల కోచ్ జైసింహా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. హెడ్ కోచ్ జై సింహా తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ.. హెచ్‌సీఏకు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే.. బస్సులో తమ ముందే మద్యం సేవించాడని.. అభ్యంతరం చెప్పినందుకు బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేశారు.
అయితే.. ఆ సమయంలో సెలెక్టర్ పూర్ణిమా రావు కూడా బస్సులోనే ఉండగా.. ఆమె కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఆరోపించారు. అయితే.. ఈ విషయంపై నాలుగు రోజుల క్రితమే మెయిల్ ద్వారా కంఫ్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని.. మహిళా క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌సీఎం అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. యాక్షన్‌లోకి దిగారు. జై సింహాను వెంటనే సస్పెండ్ చేశారు. జై సింహపై గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని.. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు జగన్ మోహన్ రావు తెలిపారు. ఇలాంటి పనులకు పాల్పడితే.. జీవితాంతం బ్యాన్ చేస్తామని, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని జగన్ మోహన్ రావు హెచ్చరించారు. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ అండగా ఉంటుందని తెలిపారు.మరోవైపు ఈ వేధింపుల ఆరోపణలపై కోచ్ జై సింహా స్పందించాడు. తానూ ఎటువంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణ చేయకుండా తనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
అయితే.. తాను బస్సులో మద్యం సేవించలేదని.. వైరల్ అవుతున్న వీడియోలో తాను తాగుతుంది కేవలం కూల్ డ్రింక్ మాత్రమేనని వివరించారు. తాను ఎవరినీ వేధించలేదని చెప్పుకొచ్చారు. హెచ్‌సీఏ తనను సస్పెండ్ చేసిందని, ఎలాంటి విచారణ చేయకుండా తనపై ఎలా చర్యలు తీసుకుంటారంటూ జై సింహా ప్రశ్నించారు.
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహాపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని HCA సీనియర్ మెంబర్ బాబు రావ్ సాగర్ తెలిపారు. జై సింహా వెనకాల హెచ్‌సీఏలోనే కొంత మంది ఉన్నారని ఆరోపించారు. ఇంటర్నల్ కమిటీలో జై సింహాపై కనీసం విచారణ జరపలేదన్నారు.
ప్రభుత్వం మహిళలకు క్రీడల్లో మంచి అవకశాలు ఇస్తుందని.. కానీ ఇలాంటి చర్యలు చూస్తే ఏ తల్లిదండ్రులు మహిళను క్రీడలకు పంపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. జై సింహాపై ఎప్పుడు ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జై సింహాను కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదని.. ఇలాంటి వారిపై ప్రభుత్వం చొరవ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.