Hanuma Vihari: ఆంధ్ర తరఫున ఆడను.. అసలేం జరిగింది?
Hanuma Vihari: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ క్రికటర్ హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) నుంచి తప్పుకున్నారు. తాను ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున క్రికెట్ ఆడనని తేల్చి చెప్పేసారు. 16 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడిన విహారి ఉన్నట్టుండి ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. (Hanuma Vihari)
అసలేం జరిగింది?
ఈరోజు రంజి స్క్వాడ్‌లో (Ranji Squad) హనుమ విహారికి.. టీంలో 17వ ఆటగాడైన కుంట్రపాకం పృథ్వీరాజ్‌కి (Kuntrapakam Prudhviraj) మధ్య వివాదం తలెత్తింది. విహారి పృథ్వీరాజ్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసాడు. దాంతో వారు అసలేం జరిగింది అని కూడా ఆలోచించకుండా విహారి పట్ల తప్పుగా ప్రవర్తించారు. ఒకరి వాదన మాత్రమే విన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పట్ల అసహనం వ్యక్తం చేసిన విహారి ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడనని ప్రకటించేసారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కుంట్రపాకం పృథ్వీరాజ్ ఎవరో కాదు.. తిరుపతికి చెందిన YSRCP కార్పొరేటర్ కుంట్రపాకం నరసింహ (Kuntrapakam Narsimha) కుమారుడే. అందుకే ఈ చిన్న విషయం పెద్ద రాద్దాంతానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు రాజీనామా చేస్తే తప్ప వివాదం చల్లారలేదంటే.. ఆ కార్పొరేటర్ తన రాజకీయ బలాన్ని ఏ రేంజ్‌లో ఉపయోగించి ఉంటాడో తెలుస్తోంది.
పృథ్వీరాజ్ తండ్రి విహారిని పిలిపించి నోటికొచ్చినట్లు మాట్లాడారట. అది విహారి తట్టుకోలేకపోయాడు. ఎన్నో టెస్టుల్లో ఆడి తన సత్తాను చాటుకున్న విహారి… ఈరోజు ఒక రాజకీయ నాయకుడి చేత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. అసలు క్రికెట్ అసోసియేషన్ కలగజేసుకుని పరిష్కరించాల్సిన విషయంలో రాజకీయ నేతలు ఎందుకు కలగజేసుకుంటున్నారో తెలీడంలేదు.
ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ప్రజా ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) ఈ ఘటనపై స్పందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బెదిరించారని అందుకే ఇంత హంగామా జరిగిందని ఆరోపించారు. వివాదాస్పద నేపథ్యాలు ఉన్నవారికే జగన్ మోహన్ రెడ్డి క్రికెట్ అసోసియేషన్‌లో చోటు కల్పించారని మండిపడ్డారు. ఇదే జరిగితే హనుమ విహారి వంటి ఎందరో టాలెంట్ ఉన్న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.
మాకు విహారినే కెప్టెన్‌గా కావాలి
ఈ నేపథ్యంలో రంజి స్క్వాడ్‌లో ఉన్న ఇతర క్రీడాకారులు అంతా కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు లెటర్ రాసారు. అందులో జరిగినదంతా వివరించారు. ఈరోజు గేమ్‌లో విహారి.. పృథ్వీరాజ్‌తో సాధారణంగా క్రికెట్ రంగంలో ఎలాగైతే మాట్లాడతామో అలాగే మాట్లాడారు. కానీ పృథ్వీరాజ్‌కు అది తప్పుగా అనిపించి ఫిర్యాదు చేసాడు. జరిగిన దానికి మేమంతా సాక్ష్యంగా ఉన్నాం. హనుమ విహారి పృథ్వీరాజ్‌తోనే కాదు ఎవ్వరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. మాకు కెప్టెన్‌గా హనుమ విహారినే కావాలి. విహారి కెప్టెన్సీలో మేం ఏడుసార్లు క్వాలిఫై అయ్యాం. విహారితో మాకు ఎలాంటి పర్సనల్ విభేదాలు లేవు. విహారి ఎప్పుడూ మాలో ది బెస్ట్‌నే తీసుకొచ్చాడు. ఆంధ్ర రంజి ప్లేయర్స్ టీం తరఫు నుంచి మాకు విహారి కెప్టెన్‌గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది అని సంతకాలు చేసి మరీ అసోసియేషన్‌కు సమర్పించారు.
ఏది ఏమైనప్పటికీ రాజకీయాలను, క్రీడలను కలిపి చూడలేం. అసలు క్రీడల విషయంలో రాజకీయాలకు చోటు లేదు. ఇలాంటి రాజకీయాల ఒత్తిడి వల్లే ఎందరో క్రికెటర్ల జీవితాలు అర్ధంతరంగా ఆగిపోతున్నాయ్. క్రీడల విషయంలో పారదర్శకత లేకపోతే ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఓ మంచి క్రికెటర్ ఎప్పుడూ బయటికి రాలేడు అనే విషయం గుర్తుంచుకోవాలి.