Vinesh Phogat: లాస్ట్‌లో ట్విస్ట్.. ఫోగాట్ విషయంలో ఏం జరిగింది?
Vinesh Phogat: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ ఫైనల్లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టిస్తుందని అందరూ ఆశపడ్డారు. ఫైనల్స్ దాకా వచ్చిన వినేష్‌కు చివరి నిమిషంలో గుండె పగిలే షాక్ తగిలింది. ఫైనల్స్‌కి ముందు ఆమె బరువు చెక్ చేయగా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దాంతో ఒలింపిక్స్ కమిటీ వినేష్‌ను ఫైనల్స్ నుంచి డిస్క్వాలిఫై చేసేసింది.
మంగళవారం రాత్రి వరకు వినేష్ రెండు కిలోలు ఎక్కువ బరువున్నారు. దాంతో రాత్రంతా నిద్రపోకుండా రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసి 1900 గ్రాములు తగ్గింది. మరో 100 గ్రాములు తగ్గితే ఆ 2 కిలోల బరువు తగ్గి కరెక్ట్ బరువుకి వచ్చేవారు. మరో 100 గ్రాముల బరువు తగ్గేందుకు కాస్త సమయం కావాలని ఇండియన్ డెలిగేట్స్ ఒలింపిక్స్ కమిటీని కోరడంతో వారు అందుకు ఒప్పుకోలేదు.
దాంతో ఆమె ఫైనల్స్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయారు. వినేష్ ఫైనల్స్ వరకు రావడమే పెద్ద చరిత్ర. ఇప్పటివరకు ఇండియా నుంచి ఏ మహిళా రెజ్లర్ కూడా ఫైనల్స్ వరకు రాలేకపోయింది. అలాంటి వినేష్ ఫైనల్స్‌కి దూసుకెళ్లి చివరి నిమిషంలో మెడల్ కొట్టలేకపోయింది. అయితే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తాను ఫైనల్స్‌లో పోటీ పడి ఓడిపోయినా బాధపడేదాన్ని కాదు కానీ కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు తన కల చేజారిందని వినేష్ తన డ్రెస్సింగ్ రూంలో కన్నీరుమున్నీరుగా విలపించడం ఇండియన్ ఒలింపిక్స్ అధికారులను కదిలించింది. దాదాపు గంటన్నర పాటు వరకు ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదట.