IVPL: పోరాడి ఓడిన తెలంగాణ టైగర్స్
IVPL: మరో కొత్త క్రికెట్ లీగ్ మొదలైంది. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (Indian Veteran Premiere League) పేరుతో బోర్డ్ ఫర్ వెటరన్ క్రికెటర్స్ ఇన్ ఇండియా నిర్వహిస్తున్న టోర్నీ శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రారంభమైంది. ఈ లీగ్ తొలి మ్యాచ్ లో తెలంగాణ టైగర్స్ ను ముంబై ఛాంపియన్స్ 26 పరుగుల తేడాతో ఓడించింది. తొలి మ్యాచ్ లోనే పరుగుల వరద పారడం ఈ లీగ్ పై ఆసక్తిని పెంచేస్తోంది.
తెలంగాణ టైగర్స్ టీమ్ కు ఈ లీగ్ లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే అతడు ఈ మ్యాచ్ కు అందుబాటులో లేడు. దీంతో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లో తెలంగాణ టైగర్స్ కు ఓటమి తప్పలేదు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఛాంపియన్స్ విజయం సాధించింది. ఆ టీమ్ లోని పీటర్ ట్రెగో, ఫిర్ మస్టర్డ్ హాఫ్ సెంచరీలు చేశారు.
మొదట ట్రెగో కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్ లతో 92 రన్స్ చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి 4 ఓవర్లలో కేవలం 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ట్రెగోతోపాటు ఓపెనర్ మస్టర్డ్ 31 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 60 రన్స్ చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఛాంపియన్స్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది.
ముంబై ఛాంపియన్స్ కు కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నా.. అతడు కూడా ఈ మ్యాచ్ ఆడలేదు. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తెలంగాణ టైగర్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 రన్స్ మాత్రమే చేయగలిగింది. టాపార్డర్ ఫెయిల్ అయినా మిడిలార్డర్ లో వికెట్ కీపర్ రవికుమార్ 27 బంతుల్లో 43, మన్‌ప్రీత్ గోనీ 18 బంతుల్లో38 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. (IVPL)
తొలి మ్యాచ్ లో గెలిచిన ముంబై ఛాంపియన్స్ రెండో మ్యాచ్ ను సోమవారం (ఫిబ్రవరి 26) చత్తీస్‌గఢ్ వారియర్స్ తో ఆడనుంది. మరోవైపు తొలి మ్యాచ్ ఓడిన తెలంగాణ టైగర్స్ టీమ్ ఆదివారం (ఫిబ్రవరి 25) రాజస్థాన్ లెజెండ్స్ తో ఆడనుంది. ఇక శనివారం (ఫిబ్రవరి 24) మధ్యాహ్నం చత్తీస్‌గఢ్ వారియర్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ.. సాయంత్రం వీవీఐపీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్ ఆడనున్నాయి.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకూ గ్రేటర్ నోయిడాలోనే ఈ టోర్నీ జరగనుంది. ఒక్కో టీమ్ ఐదు మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్ జరుగుతాయి. ఇండియాలో ఈ మ్యాచ్ లు డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్ ఛానెల్, ఫ్యాన్‌కోడ్ లలో లైవ్ చూడొచ్చు. క్రిస్ గేల్ తాను త్వరలోనే ఈ లీగ్ లో చేరనున్నట్లు ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. అతనితోపాటు సెహ్వాగ్, రైనా లాంటి ప్లేయర్స్ ఈ లీగ్ లో ఉండటంతో ఐవీపీఎల్ పై క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.