IND vs ENG: మ్యాచ్ మనదే.. సిరీస్ మనదే..!
IND vs ENG: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌లు టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. చేధనలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) బాధ్యతాయుతంగా ఆడి టీమిండియాకు మ్యాచ్‌తో పాటు సిరీస్ విజయాన్ని అందించారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయానికి మరో 70 పరుగులు అవసరమైన దశలో 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను.. శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్‌ను ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
దీంతో ఐదు మ్యాచ్‌లు సిరీస్‌లో భారత్.. నాలుగు మ్యాచ్‌లు ముగేసి సరికే 3-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచినా, ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ వశమైనట్లే. నాలుగో టెస్టులో బాధ్యయుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. (IND vs ENG)
ఓవర్ నైట్ స్కోరు 40/0 తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు జోడించి గెలుపొందింది. ఓవర్ నైట్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (16), రోహిత్ శర్మ (24) లు నాలుగో రోజు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లను కుదురుకోనివ్వకూడదు అనే లక్ష్యంతో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో జోరూట్ బౌలింగ్‌లో అండర్సన్ పట్టిన అద్భుత క్యాచ్ కు యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 84 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
మరోవైపు ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 69 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించారు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌పై ఒత్తడి తెచ్చే ప్రయత్నం చేశారు. రోహిత్ శర్మను టామ్‌హార్డ్లీ ఔట్ చేయగా పేలవ ఫామ్ కొనసాగించిన రజత్ పాటిదార్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో 100 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
మరికాసేపటికే కాసేపటికే రవీంద్ర జడేజా(4), సర్ఫరాజ్ ఖాన్ (0) లు కూడా ఔట్ అయ్యారు. దీంతో భారత్ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఏదైన అద్భుతం చేస్తుందేమోనని అనిపించింది. విజయానికి ఇంకా 72 పరుగులు అవసరమైన దశ అది. మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్‌లు మాత్రమే. దీంతో వీరిద్దరి ఔట్ చేసి మ్యాచ్‌ను లాగేసుకోవాలని ఇంగ్లాండ్ భావించింది.
కానీ, ఇంగ్లాండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ.. ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అబేధ్యమైన 6వ వికెట్‌కు 72 పరుగులు జోడించిన ఈ యంగ్ బ్యాటర్లు.. టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) నాటౌట్‌లుగా నిలిచారు.
సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
జట్టు స్కోర్లు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 353 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 307 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 145 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 192/5