MS Dhoni: ధోనీ ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉండే క్రేజే వేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినా.. IPL ద్వారా క్రికెట్ అభిమానులను అల్లరిస్తున్నాడు. ధోనీ కనిపించాడంటే పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీలకోసం పోటీపడుతుంటారు. పలు సందర్భాల్లో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ కోసం యువకులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మార్చి 22 నుంచి ఐపీల్ 2024 టోర్నీ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఈసారి కూడా ఆ జట్టుకు కెప్టెన్ గా ధోనీనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గత వారం రోజులుగా చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోపీని అందించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

తాజాగా చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తిచేసుకున్న తరువాత ధోనీ మైదానాన్ని వీడే క్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు ధోనీ ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడ్డారు. ధోనీసైతం ఏమాత్రం ఇబ్బందిపడకుండా ప్రతీ ఒక్కరికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లకు పనిచెప్పి ధోనీని ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. ఈ వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అధికారిక X (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.

ALSO READ: ఎంఎస్ ధోనీని తలపించిన బంగ్లా కీపర్.. వీడియో వైరల్..!

అయితే, ఈ సీజన్‌లోనూ టైటిల్ సాధించాలని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈసారి స్టైలిస్ లుక్‌తో వస్తున్నాడు. జులపాలతో కెరీర్ ఆరంభించిన ధోనీ ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. (MS Dhoni)

అయితే ఎప్పటిలానే ఐపీఎల్‌లో ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అనే చర్చ, ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఒకవేళ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికితే సీఎస్‌కేను నడిపించేది ఎవరనేది అసలు ప్రశ్న. గతంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అందించినా ఫలితం లేకపోయింది. సారథిగా జడ్డూ ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు ఐపీఎల్-2025కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ పరంగా ధోనీ వారసుడిని ఈ సీజన్‌లో చెన్నై ఫ్రాంచైజీ తప్పక వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేలంలో ఆటగాడిని కొనుగోలు చేసి, ఆ తర్వాత అతడికి కెప్టెన్సీ పగ్గాలు అందివ్వాలని సాధారణంగా ఏ ఫ్రాంచైజీ భావించదు. అందుకే రిటైన్ చేసుకునే ఆటగాళ్లలోనే నాయకుడిని ఎంచుకుంటుంది. అయితే ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బదులిచ్చాడు. భవిష్యత్‌లో సారథి ఎవరనే విషయం గురించి సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ చాలా స్పష్టతతో ఉన్నాడని తెలిపాడు.

”కెప్టెన్ విషయంపై అంతర్గత చర్చలు జరిగాయి. దీనిపై శ్రీనివాసన్ చాలా క్లియర్‌గా ఉన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ వంటి విషయాలను కోచ్, ప్రస్తుత సారథికి వదిలేయాలి. వాళ్లు నిర్ణయించుకున్న తర్వాత నాకు ఆ సమాచారాన్ని అందిస్తారు. ఆ తర్వాత మీకు నేను తెలియజేస్తాను. అప్పటివరకు మనం ఈ విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిది.

”ప్రస్తుతం నాకౌట్స్‌కు అర్హత సాధించడంపై దృష్టిసారించాం. అదే మా మొదటి లక్ష్యం. ఆ తర్వాత ఆ రోజు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. గత కొన్నాళ్లు‌గా ఇదే అనుసరిస్తున్నాం. ‘తొలుత లీగ్ మ్యాచ్‌లపై ఫోకస్ చేద్దాం. నాకౌట్స్ క్వాలిఫై కావడానికి ట్రై చేద్దాం’ అని ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ.. జట్టుతో ఇదే చెబుతుంటాడు. జట్టుపై ఒత్తిడి ఉంటుంది. గత కొన్నాళ్లుగా నిలకడైన ప్రదర్శన చేస్తున్న కారణంగా ఆటగాళ్లపై ఒత్తిడి సహజం” అని విశ్వనాథన్ పేర్కొన్నాడు.