Sania Mirza: వైరల్ గా మారిన సానియా మీర్జా ట్వీట్..!
Sania Mirza: మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మహిళలపై వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని పేర్కొన్నారు. ఓ మహిళ సాధించిన విజయానికి ఎలా విలువ కడుతున్నామని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఓ కంపెనీ చేసిన యాడ్ వీడియోను ట్వీట్ చేస్తూ.. స్త్రీ, పురుష వివక్ష చూపొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
చోటీ సోచ్ పేరుతో అర్బన్ క్లాన్ కంపెనీ విడుదల చేసిన యాడ్ లో ఓ మహిళ బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ కారు కొనుగోలు చేస్తుంది. కొత్త కారులో ఇంటికి వచ్చిన మహిళను చూసి చుట్టుపక్కల వాళ్లు హేళనగా మాట్లాడుతారు. పార్కింగ్ వద్ద క్రికెట్ ఆడుకుంటున్న ఆమె తమ్ముడు ఈ మాటలు విని బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇరుగుపొరుగు అన్న మాటలను అక్కకు చెబుతూ ఆవేదన చెందుతాడు. దీంతో ఆ మహిళ మాట్లాడుతూ.. ‘నేను కొన్న కారు అందరికీ కనబడుతుంది కానీ దానిని కొనేందుకు నేను పడ్డ శ్రమ, నా కష్టం ఎవరికీ కనిపించదు. ఓ మహిళ విజయం సాధించిన ప్రతిసారీ సమాజం ఆమెను కించపరచాలనే చూస్తుంది. అలాంటి మాటలకు బాధపడుతూ ఉన్నచోటనే ఆగిపోవాలా.. కష్టపడుతూ ముందుకు సాగాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది’ అని చెబుతుంది. (Sania Mirza)
ఈ యాడ్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సానియా మీర్జా ఈ వీడియో ట్వీట్ చేసి తన స్వంత విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచాను. అది గొప్పదే కదా..?డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ కెరీర్‌లో నాకు ఎంతోమంది మద్దతు ఇచ్చారు. కానీ, ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదు. ఈ యాడ్ చూసిన తర్వాత నా మదిలో ఎన్నో భావాలు మెదిలాయి. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడటం కష్టమేనని తెలుసు. కానీ, ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో..!’’ అని ఆమె రాసుకొచ్చారు.
ఆరేళ్ల వయసులోనే టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. 2003లో 16 ఏళ్ల వయస్సులో ప్రొఫెషనల్ ఆటలోకి అడుగుపెట్టారు. తన సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచారు. ఈ క్రమంలో తన ఆటతోనే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ తరచూ వార్తల్లో నిలిచారు.
గత నెలలో మాలిక్.. మీర్జాతో 14 ఏండ్ల పెండ్లి బంధాన్ని తెంచుకుని పాక్ వర్ధమాన నటి సనా జావేద్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. మాలిక్‌తో విడిపోయినప్పట్నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి ఇంతవరకూ స్పందించని సానియా.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ ఆసక్తికర పోస్టులు పెడుతోంది. షోయభ్ మాలిక్ పెండ్లి తర్వాత అతడు క్రికెట్ బిజీలో మునిగిపోయి పాత జ్ఞాపకాలేవీ దరిచేరనీయడం లేదు. కానీ సానియా మాత్రం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఎప్పుడో దూరమైంది. ప్రస్తుతం ఆమె కొడుకుతో కలిసి దుబాయ్‌లో ఉంటుంది.