Sachin Tendulkar: కాశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్
Sachin Tendulkar: టీమిండియా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి కశ్మీర్ లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా గుల్‌మార్గ్‌లో స్థానికులతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. చుట్టూ లోయల మధ్య రోడ్డుపై స్థానికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేశాడు. తనను ఔట్ చేయాలని వారికి సచిన్ సవాల్ విసిరాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ వికెట్ తీయడంలో వారు విఫలమయ్యారు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్ గాడ్ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా “క్రికెట్ అండ్ కాశ్మీర్.. స్వర్గంలో మ్యాచ్” అంటూ రాసుకొచ్చాడు. కాగా సచిన్ చాలా ప్రాంతాలను సందర్శించాడు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది.
కశ్మీర్ టూర్ లో సచిన్ తాజాగా క్రికెట్ బ్యాట్‌ల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. కశ్మీర్‌లో మాత్రమే లభించే విల్లో చెట్టు టేకుతో తయారు చేసిన బ్యాట్లను ఆయన పరిశీలించారు. బ్యాట్ నాణ్యత, ఇతర అంశాలపై ఆరా తీశారు. తన తొలి బ్యాట్ కశ్మీర్ విల్లోతో తయారు చేసిందేనని ఈ సందర్భంగా సచిన్ గుర్తు చేసుకున్నారు. ఆ బ్యాట్‌ను తన సోదరి ఇచ్చినట్లు చెప్పాడు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అయిన అమన్ సేతు వంతెనను కూడా టెండూల్కర్ సందర్శించారు. అమన్ సేతు సమీపంలోని కమాండ్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ సుమారు గంటపాటు ముచ్చటించారు. (Sachin Tendulkar)
సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సందడి చేశారు. తన భార్య అంజలి, కుమార్తె సారా, కుమారుడు అర్జున్‌తో కలిసి దాల్ సరస్సులో షికారా రైడ్ చేశారు. షికారా రైడ్ అద్భుతం అంటూ ఆస్వాదిస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్‌గామ్ పర్యాటక కేంద్రాన్ని కూడా సందర్శించారు.
సచిన్ 2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. రిటైర్‌మెంట్ అయి 10 ఏళ్లు దాటినా కూడా సచిన్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. 50 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. స్టేడియంకు ఎక్కడికి వెళ్లినా అభిమానులు సచిన్ సచిన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన పట్ల గౌరవాన్ని చాటుకుంటారు. తాజాగా మాస్టర్ కశ్మీర్ పర్యటనకు వెళ్లగా.. తన కుటుంబంతో కలిసి ఈ దిగ్గజ ఆటగాడు ప్రయాణిస్తుండగా.. విమానంలోని మిగిలిన ప్రయాణీకులు అంతా కూడా సచిన్ నామస్మరణతో హోరెత్తించారు.
టీమ్ఇండియా తరుపున సచిన్ 200 టెస్టులు, 463 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 శతకాలు 68 అర్థశతకాలు ఉన్నాయి. 463 వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకే ఒక టీ20 మ్యాచులో 10 పరుగులు చేశాడు. 78 ఐపీఎల్ మ్యాచుల్లో 2334 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అయితే.. సచిన్ పోస్ట్ చేసిన వీడియోలో క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) ఫోటో ఉంది. గుల్మార్గ్‌లోని ఓ షాపును సచిన్ సందర్శించగా.. అక్కడ షాపు గోడలపై శుభ్‌మన్ గిల్ ఫోటోలు ఉండడం చూసి ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. అన్ని షాపులు ఉంటే అల్లుడి ఫోటో ఉన్న షాపుకే వెళ్లాలా అని కామెంట్స్ పెడుతున్నారు. సచిన్ తెందుల్కర్ కుమార్తె సారా తెందుల్కర్.. (Sara Tendulkar) శుభ్‌మన్ గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. వీరి పెళ్లికి సచిన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.