Rishabh Pant: మా కెప్టెన్ అతడే.. తగ్గేదేలేదంటున్న ఢిల్లీ క్యాపిటల్స్
Rishabh Pant: టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఖారారైంది. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ అప్పటి నుంచి ఆటకు దూరం అయ్యాడు. IPL 2024 సీజన్ నుంచి ఈ వికెట్ కీపర్, బ్యాటర్ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్లో పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) యాజమాన్యం ధ్రువీకరించింది.
అంతేకాదు ఢిల్లీ జట్టుకు పంత్ నాయకత్వం వహిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ తెలిపారు. మొదటి మ్యాచ్ నుంచే అతడు జట్టుకు సారథిగా ఉండాడని చెప్పాడు. ఏడు మ్యాచుల వరకు అతడు బ్యాటర్, కెప్టెన్ సేవలు అందిస్తాడని, వికెట్ కీపింగ్ చేయడని అన్నారు. ఈ మ్యాచుల్లో పంత్ శరీరం ఎలా సహకరిస్తుందో చూసిన తరువాత మిగిలిన మ్యాచుల్లో అతడిని ఎంపిక చేయాలా వద్దా అనే విషయం పై ఆలోచించనున్నట్లు వెల్లడించారు.
ALSO READ: Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్.. ప్రాక్టీస్ అదుర్స్
“రిషబ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగెత్తుతున్నాడు. వికెట్ కీపింగ్ ప్రారంభించాడు. అతను ఐపీఎల్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది. రిషబ్ ఐపీఎల్ ఆడతాడని నేను ఆశిస్తున్నాను. అతను తొలి మ్యాచ్ నుండే నాయకత్వం వహిస్తాడు. మొదటి ఏడు మ్యాచ్‌లు అతడు ఓ బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడు. అతడి శరీరం ఎలా స్పందిస్తుందో చూసిన తరువాత మిగిలిన IPL కోసం తీసుకుంటాం.” అని జిందాల్ అన్నారు. (Rishabh Pant)
రెండేండ్ల క్రితం రూర్కీ సమీపంలో కారు యాక్సిడెంట్‌కు గురైన పంత్ ఆటకు దూరమై దాదాపు 14 నెలలు అవుతోంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్న పంత్ కష్టమైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 17వ సీజన్‌కు మరో నెల రోజులే ఉండడంతో పంత్ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో పంత్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. మునుపటి స్థాయిలో వేగంగా కదలకపోయినా.. ప్రాక్టీస్‌లో యాక్టివ్ గానే కనిపించాడు. దీంతో మైదానంలో రీఎంట్రీకి సిద్ధమైనట్లు చెప్పకనే చెప్పాడు.
పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ 16వ సీజన్లో ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా అతడు రాణించినప్పటికీ.. ఓపెనర్ పృథ్వీ షా, ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్, రిలే రస్సో, మనీశ్ పాండేలు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో, ఢిల్లీ 14 మ్యాచుల్లో కేవలం ఐదింటిలోనే గెలుపొందింది. 14వ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ మరీ దారుణమన ఆటతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
ALSO READ: Rishabh Pant: అండర్ 19 క్రికెటర్ చేతిలో మోసపోయిన రిషబ్
ఇక, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆండ్రీ నోర్ట్జే వెన్ను గాయం కారణంగా ఇటీవలి అనేక మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. అయితే అతడు ఫిట్నెస్ సాధించాడని ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ చెప్పారు. 2020లో నార్ట్జే చేరినప్పటి నుండి అతడు క్యాపిటల్స్ లైనప్‌లో ఓ స్థిరమైన సభ్యుడిగా కొనసాగుతున్నాడన్నారు. ఇప్పటి వరకు అతడు ఢిల్లీ తరుపున 53 వికెట్లు తీశాడన్నారు. 2020 సీజన్లో 23.27తో 22 వికెట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రిషబ్ పంత్‌తో పాటు నోర్ట్జే లు తిరిగి ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరిద్దరితో పాటు అద్భుతమైన ఆటగాళ్లతో కూడిన జట్టు తమదని చెప్పారు. ట్రిస్టన్ స్టబ్స్ వంటి ఆటగాళ్లు ఉండడం జట్టుకు కలిసి వస్తుందన్నాడు.